కాశ్మీర్ యాపిల్ పండ్లకు మన దేశంలోనే కాదు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది. అవి ఉండే రంగుకు, వాటి రుచికి ఎంతో మంది ఫిదా అవుతుంటారు. మన దేశంలో ఎక్కడికి వెళ్లినా.. ఏ మార్కెట్‌లో చూసినా దాదాపుగా మనకు కాశ్మీర్ యాపిల్ పండ్లే అధికంగా కనిపిస్తాయి. ఇతర దేశాల నుంచి యాపిల్ పండ్లు వచ్చినా కాశ్మీర్ యాపిల్ పండ్లు అంటేనే ప్రజలు ఎక్కువగా మక్కువ చూపిస్తారు. ధర తక్కువగా ఉండడమే కాదు, రుచిగా కూడా ఉంటాయి. అయితే గత కొన్నేళ్లుగా కాశ్మీర్ యాపిల్ పండు తన ప్రాభవాన్ని కోల్పోతోంది.
కాశ్మీర్ యాపిల్ పండ్లుకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఇరానియన్ యాపిల్ పండ్లు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. దీంతో కాశ్మీర్ యాపిల్ పండ్లను పండించేవారు తీవ్రమైన నష్టాల బారిన పడుతున్నారు. అసలే కరోనా వల్ల గత ఏడాది కాలంగా వ్యాపారాల నష్టాల్లో ఉన్నాయి. దీనికి తోడు ఇప్పుడు ఇరానియన్ యాపిల్ పండ్లు మార్కెట్లలో చాలా తక్కువ ధరలకే లభిస్తుండడం వారిని కలవరానికి గురి చేస్తోంది.
సాధారణంగా ఆప్ఘనిస్థాన్ నుంచి ఏ వస్తువును దిగుమతి చేసుకున్నా అందుకు పన్నులు చెల్లించాల్సిన పనిలేదు. భారత్ కు, ఆ దేశానికి మధ్య ఉన్న ఒప్పందం అలాంటిది. అయితే కొన్ని వస్తువులు, పదార్థాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ క్రమంలో యాపిల్స్ కూడా ఆ జాబితాలో ఉన్నాయి. అయితే దేశంలో ఉన్న కొందరు వ్యాపారులకు ఇదే అదనుగా మారింది. వారు పెద్ద మొత్తంలో ఇరానియన్ యాపిల్ పండ్లను ముందుగా ఆఫ్గనిస్థాన్‌కు దిగుమతి చేసి అక్కడి నుంచి వాటిని భారత్‌కు దిగుమతి చేస్తున్నారు. దీంతో పన్ను ఉండకపోవడం వల్ల వారు చాలా తక్కువ ధరలకే యాపిల్ పండ్లను విక్రయిస్తున్నారు.
ఢిల్లీలోని ఆజాద్‌పూర్ పండ్ల మార్కెట్‌కు ప్రస్తుతం ఇరానియన్ యాపిల్ పండ్లు పోటెత్తుతున్నాయి. అయితే ఇప్పటికే అక్కడ కాశ్మీర్ యాపిల్ పండ్లను విక్రయిస్తున్న వారికి ఆ పండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో సులభంగా తెలుస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి యాపిల్ పండ్లను పండించే వారికి అవి ఏ జాతికి చెందినవి, ఎక్కడ పండినవో గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు. దీంతో వారు ఇరానియన్ యాపిల్ పండ్లను సులభంగా గుర్తించగలుగుతున్నారు. అయితే ఢిల్లీ పండ్ల మార్కెట్లలో 10 కిలోల కాశ్మీర్ యాపిల్ పండ్ల బాక్స్ ధర రూ.1000 ఉంటే ఇరానియన్ యాపిల్ పండ్ల బాక్స్ ధర రూ.750 మాత్రమే ఉంది. అందువల్ల ఆ పండ్లనే వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.
ఇలా కాశ్మీర్ యాపిల్ పండ్ల విక్రేతలకు అన్యాయం జరుగుతోంది. దీనిపై వారు ఎన్నో సార్లు కేంద్రానికి మొర పెట్టుకున్నారు. అయినప్పటికీ ఎవరూ వారి గోడును పట్టించుకోవడం లేదు. దీంతో తీవ్రమైన నష్టాల బారిన పడాల్సి వస్తుందని యాపిల్ పండ్ల విక్రేతలే కాదు, యాపిల్ పండ్లను సాగు చేసే రైతులు కూడా చెబుతున్నారు. మరి ఇప్పటికైనా కేంద్రం వీరి బాధను అర్థం చేసుకుంటుందా ? కాశ్మీర్ యాపిల్ పండ్ల విక్రయాలకు మళ్లీ ఊతం లభిస్తుందా ? అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.