జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుపై విపక్షాలు చేస్తోన్న విమర్శలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్ సభలో గట్టిగా సమాధానం ఇచ్చారు.జమ్మూ కశ్మీర్ అస్థిత్వాన్ని 1990 జనవరి 19న సమాధి చేశారని విమర్శించారు. ” కశ్మీర్ ఇండియా కిరీటం…అంత గొప్ప గౌరవం ఉన్న దాన్ని బాంబులు, ఉగ్రవాదంతో దిగజార్చారు…కొంత మంది 1990 జనవరి 19న కాళరాత్రిలో కశ్మీర్ అస్థిత్వాన్ని సమాధి చేశారు” అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ లో మంటలు రేపారంటారు కొందరు…కొంత మందిని జైల్లో పెట్టారని మరి కొందరు మాట్లాడుతున్నారు…ఈ సభ రాజ్యాంగాన్ని కాపాడుతుంది..రాజ్యాంగానికి అంకితమైంది అన్నారు ప్రధాన మంత్రి.
గత ఏడాది ఆగస్గ్ జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 ని ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. జమ్మూ కశ్మీర్, లద్దాక్ లు గా విభజించింది. ఆర్టికల్ 370 రద్దుతో రాష్ట్రంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ప్రభుత్వం పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేసింది. వందలాది మంది కీలక నేతలను నిర్బంధించింది. మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లాతో సహా ముగ్గరు మాజీ సీఎంలను అరెస్ట్ చేసి నిర్బంధించింది.
1990 జనవరి 19 కశ్మీరీ పండిట్లకు దుర్దినం. ఉగ్రవాదుల హింస, వేధింపులు, అత్యాచారాలకు భీతిల్లిన లక్షలాది కశ్మీరీ పండిట్లు ఇళ్లు, వాకిలి, ఆస్తులు అన్నీ వదిలి బతుకు జీవుడా అంటూ ఆ రాష్ట్రం వదిలి వెళ్లిపోయారు.