కశ్మీర్ లో శ్రీనగర్, గుల్ మార్గ్, పహల్ గామ్, సోనామార్గ్, టులిప్ గార్డెన్ లాంటి ఎన్నో అందమైన టూరిస్ట్ ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ప్రకృతి రమణీయతను వర్ణించడానికి మాటలు సరిపోవు. అందుకే కశ్మీర్ ను భూతల స్వర్గం అని అందరూ అంటూ ఉంటారు.
ఈ ఏడాది కశ్మీర్ కు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాదిలో రికార్డు స్థాయిలో పర్యాటకులు కశ్మీర్ ను సందర్శించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ దశాబ్దంలో ఇంత పెద్ద సంఖ్యలో సందర్శకులు కశ్మీర్ కు రావడం ఇదే ప్రథమం వెల్లడించారు.
‘ గత పదేండ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ ఏడాదిలో అత్యధికంగా పర్యాటకులు కశ్మీర్ కు వచ్చారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా టూరిజం కోసం మేము పెద్ద ఎత్తున క్యాంపెయిన్ లు నిర్వహించాము. ఇందుకోసం సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లలో పెద్ద ఎత్తున ప్రచారాలు చేశాము’ అని కశ్మీర్ టూరిజం డైరెక్టర్ జీఎన్. ఇటూ తెలిపారు.
కశ్మీర్ టూర్ పై చాలా మంది పర్యాటకులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇంత అందమైన ప్రాంతాన్ని ఎక్కడా చూడలేదని, ప్రత్యేకంగా ఇక్కడ ఉన్న టులిప్ గార్డెన్ ఓ అద్భుతమని పర్యాటకులు చెబుతున్నారు.