కశ్మీర్ యువత గురించి షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. చదువు పేరుతో అధికారిక వీసాలపై పాకిస్థాన్ వెళ్లి.. ఉగ్రవాదులుగా తిరిగి వస్తున్నారనే వార్తలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో కశ్మీర్ లోయలో రెచ్చగొడుతున్న ఉగ్రవాదాన్ని స్వదేశీ ఉద్యమంగా చిత్రీకరించడానికి ఐఎస్ఐ కొత్త పద్ధతిని అవలంబించిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల లోయలోకి చొరబడిన 17 మంది కశ్మీర్ యువకులు తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో మరణించారు. వారి గురించి ఆరా తీస్తే సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కరడుగట్టిన ఉగ్రవాది షాకీర్ అల్తాఫ్ భట్ జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. అతడి గురించి ఆరా తీయగా.. 2018లో విద్యాభ్యాసం కోసం భారత పాస్‌పోర్టుపై పాకిస్తాన్‌కు వెళ్లి, ఉగ్రవాదిగా మారి జమ్మూకశ్మీర్‌కు తిరిగొచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇలాంటి కేసులు క్రమంగా వెలుగులోకి రావటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ఈ క్రమంలో 2015 నుంచి 2019 వరకూ జమ్మూకశ్మీర్‌లో జారీ చేసిన పాస్‌పోర్టులపై దర్యాప్తు సంస్థలు ఆరా తీశాయి. అయితే, పెద్ద సంఖ్యలో యువకులు ఉన్నత చదువులు చదవడానికి, బంధువులను కలవడానికి లేదా వివాహ ప్రయోజనాల కోసం పాకిస్తాన్‌కు వెళ్లడానికి వీసాలను అధికారిక మార్గాలలోనే పొందుతున్నట్లు తెలిసింది. యువత అన్ని అధికారిక పత్రాలతో రాచమార్గంలో పాకిస్తాన్‌కు చేరుకొని, ఉగ్రవాద శిక్షణ పొంది, తిరిగొస్తుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామం దేశ భద్రతకు సవాలు లాంటిదేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఐదేళ్లలో పాసుపోర్టులో పొందినవారిలో 40 మంది యువత ఉన్నత విద్యాభ్యాసం పేరుతో బంగ్లాదేశ్ లేదా పాకిస్తాన్‌కు వెళ్లినట్లు తేలింది. వీరిలో 28 మంది ఆయా దేశాల్లో ఉగ్రవాద శిక్షణలో రాటుదేలి, భారత్‌లోకి అక్రమంగా చొరబడినట్లు తేటతెల్లమయ్యిందని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. మూడేళ్లలో మరో 100 మందికిపైగా కశ్మీరీ యువత వీసాపై పాకిస్తాన్‌కు వెళ్లారు. వీరిలో చాలామంది తిరిగిరాలేదు. తిరిగిగొచ్చిన కొందరు కనిపించకుండా పోయారు. వీరంతా స్లీపర్ సెల్స్‌గా మారి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఈ నేపథ్యంలో యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్, దేశంలోని ఉన్నత, సాంకేతిక విద్యా నియంత్రణ సంస్థలైన ఆల్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటన విడుదల చేస్తూ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడం కోసం పాకిస్తాన్‌కు వెళ్లవద్దని హెచ్చరించింది.
గతేడాది ఏప్రిల్ 1 నుంచి 6వ తేదీ దాకా దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్, కుల్గాం, అనంతనాగ్ జిల్లాకు చెందిన కొందరు యువకులు సరైన ధ్రువపత్రాలతో పాకిస్తాన్‌కు వెళ్లారనీ, వారు ఇప్పటికీ అధికారికంగా తిరిగి రాలేదని అధికారులు చెప్పారు. ఈ యువకులను సరిహద్దు దాటించి, బ్రెయిన్‌వాష్ చేసి, వారిలో కొందరికి ఆయుధ శిక్షణ ఇవ్వడం లేదా.. మనీలాండరింగ్‌కు ఉపయోగించుకోవడం వాటి చర్యలకు ఐఎస్ఐ పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు, సరైన వీసాలపై పాకిస్తాన్‌కు వెళ్లి, ఆ దేశంలో విద్యనభ్యసిస్తున్నారని భావించిన 17 మంది యువకులు నియంత్రణ రేఖ వద్ద లేదా ఎన్‌కౌంటర్‌లో చంపబడ్డారని, వారి తల్లిదండ్రులు నమ్మలేని విధంగా చేశారని అధికారులు తెలిపారు. అలాగే, తక్కువ వ్యవధిలో చెల్లుబాటు అయ్యే వీసాలపై పాకిస్తాన్‌కు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత అదృశ్యమైన యువకులను భద్రతా అధికారులు ట్రాక్ చేస్తున్నారు. ఎందుకంటే వారు సరిహద్దు ఆవల నుండి పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపుల స్లీపర్ సెల్స్ కావచ్చునని వారు భావిస్తున్నారు.
ఇందులో భాగంగానే భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతున్న ప్రాంతానికి సమీప గ్రామాల నుంచి యువత వచ్చి, భద్రతా బలగాలపైకి రాళ్లు విసిరినట్లు భావిస్తున్నారు. అంతేకాదు, దాక్కున్న ఉగ్రవాదులు పారిపోవడానికే అలా చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో భద్రతా సిబ్బందిపై రాళ్లు విసిరేవారిపై, విధ్వంసకర కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.
ఇలాంటి వారికి ఇకపై ప్రభుత్వ ఉద్యోగాలు రావు, కనీసం పాస్‌పోర్టు కూడా పొందలేరు. ఈ మేరకు జమ్మూకశ్మీర్ పోలీసు శాఖ సీఐడీ విభాగం ఉత్తర్వు జారీ చేసింది. పాసుపోర్టు కోసం దరఖాస్తు చేసుకుంటే సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వరు. రాళ్లు విసిరేవారు ప్రభుత్వ పథకాల్లోనూ లబ్ధి పొందలేరు. పోలీసుల వద్ద, భద్రతా సిబ్బంది వద్ద, దర్యాప్తు సంస్థల వద్ద ఉన్న సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజీ, ఫోటోలు, వీడియోలు, ఆడియో క్లిప్‌లను నిశితంగా పరిశీలిస్తామని.. పాస్‌పోర్టులు, ప్రభుత్వ ఉద్యోగాలు, పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారు అందులో ఉన్నట్లు తేలితే వాటిని నిరాకరిస్తామని అధికార వర్గాలు తెలిపాయి.