కశ్మీర్‌లో పండిట్లపై ఉగ్రవాదుల దాడులు ఆగడం లేదు. తాజాగా లోయలో మరో కశ్మీర్ పండిట్ హత్యకు గురయ్యారు. షోపియాన్ జిల్లాలో కశ్మీర్ పండిట్‌ను ముష్కరులు కాల్చి చంపారు. చౌదరీ గండ్‌లోని పురన్ కృష్ణన్ భట్‌పై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.
ఇంటిలోని గార్డెన్ వద్దే భట్ ను ముష్కరులు కాల్పులు జరిపారు. ఆ విషయాన్ని గమనించిన స్థానికులు భట్ ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే భట్ మరణించినట్టు వైద్యులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు రంగంలోకి దిగాయి.
ఆ ప్రాంతంలో గాలింపులను ముమ్మరం చేశారు. ఈ దాడికి తామే బాధ్యులమంటూ కశ్మీర్ ఫ్రీడం ఫైటర్స్ అనే సంస్థ ప్రకటించుకుంది. అయితే భట్‌ను ఎందుకు హత్య చేశారో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు స్కూటర్ పై అప్పుడే బయటకు వెళ్లి వచ్చారని డీఐజీ సుజీత్ కుమార్ తెలిపారు.
ఆ సమయంలో ఒక్కడే వచ్చి దాడి చేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటన సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న గార్డు సహా ఇతర అధికారులపై చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. మరోవైపు కశ్మీర్ పండిట్ హత్యను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఖండించారు. పిరికిపందల చర్యగా దాన్ని ఆయన అభివర్ణించారు.