వివేక్ అగ్నిహోత్రి సినిమా ‘కశ్మీర్ ఫైల్స్’ మళ్ళీ రచ్చ రేపుతోంది. గోవాలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో జ్యురీ హెడ్, ఇజ్రాయెల్ కి చెందిన సినీ దర్శకుడు నదవ్ లాపిడ్ ఈ మూవీపై చేసిన వ్యాఖ్యలకు దాదాపు సెలబ్రిటీలంతా భగ్గుమంటున్నారు. ఇది వల్గర్ సినిమా అని, ప్రచారం కోసం తీసింది తప్ప మరేమీ కాదని ఆయన చేసిన కామెంట్స్ పై అంతా నిప్పులు కక్కారు.
. తాజాగా కశ్మీరీ పండిట్లు కూడా ఆయనను దుయ్యబట్టడం ప్రారంభించారు. ఈ చిత్రంలో చూపిన ఘట్టాలు, సంఘటనల తాలూకు సీన్లు కేవలం 5 శాతం మాత్రమేనని, అసలు ఏం జరిగిందో 95 శాతం కూడా వాళ్ళు చూడలేదని యోగేష్ అనే పండిట్ అన్నారు. నదవ్ లాపిడ్ వ్యాఖ్యలను ఇజ్రాయెల్ రాయబారి ఖండించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.’ లాపిడ్ మా గాయాలపై ఉప్పును రుద్దారు’ అని రంజన్ అనే మరో పండిట్ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
దేశం నుంచి లాపిడ్ ని వెంటనే పంపివేయాలని పలువురు కశ్మీరీ పండిట్లు డిమాండ్ చేశారు. మా పండిట్ల వలస వెనుక ఉన్న వాస్తవాలను 30 ఏళ్లుగా కప్పి పెట్టి ఉంచారని, వీటిని ఈ చిత్రం బయట పెట్టిందని పండిట్ వికాస్ రైనా పేర్కొన్నారు. ఈయన తండ్రి అశోక్ కుమార్ రైనాను లోగడ హిజ్ బుల్ ముజాహిదీన్లు కాల్చి చంపారు.
‘వీళ్లకు మా బాధ తెలుసా ? నా చిన్నప్పుడే మా తండ్రిని, లెక్చరర్లయిన ఇద్దరిని ఉగ్రవాదులు హతమార్చారు.. ఈ ముగ్గురినీ బస్సు నుంచి కిందికి బలవంతంగా కిందికి దింపి వారిపై బులెట్ల వర్షం కురిపించారు’ అని ఆయన ఆవేదనగా తెలిపాడు. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా మా కష్టాలను చూపింది అన్నాడాయన. ఇలాగే కుల్గామ్ జిల్లాలో తమ ఇంట్లో ఉన్న తన తండ్రిని, తాతను టెర్రరిస్టులు బయటకు లాగి చంపారని సందీప్ కౌల్ అనే పండిట్ వెల్లడించాడు. తన వ్యాఖ్యలకు లాపిడ్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు. నా పాత గాయాలను ఆయన వ్యాఖ్యలు మళ్ళీ నాకు, నా తల్లికి తీవ్ర మనోవేదన కలిగించాయని ఆయన దాదాపు కన్నీటి పర్యంతమయ్యాడు.