ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు రాజేంద్రనాథ్ రెడ్డి. మంగళగిరిలోని ఆఫీస్ లో గౌతమ్ సవాంగ్ నుంచి ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి జగన్ కి ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల ధనప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని అన్నారు రాజేంద్రనాథ్ రెడ్డి. ఏ సమస్య వచ్చినా ప్రజలు పోలీసుల వద్దకే వస్తారని.. కిందిస్థాయిలో తప్పు చేస్తే మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందని చెప్పారు. మహిళలు, పిల్లలు, అణగారిన వర్గాలకు వేగంగా సేవలు అందిస్తామన్నారు.
నిరాధారమైన ఆరోపణలు సిబ్బందిపై వస్తే విచారణ చేసి వారికి రక్షణగా ఉంటామని తెలిపారు. రాయలసీమ జిల్లాల్లో ఎర్రచందనం, విశాఖలో గంజాయి సమస్యలపై ఎక్కువగా దృష్టి పెడతామని చెప్పారు.
మత సామరస్యాన్ని భంగం కలిగించే ప్రయత్నం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు కొత్త డీజీపీ. ఈ విషయంలో ప్రజాప్రతినిధుల సహకారం తమకు చాలా అవసరమని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలపై దాడులకు దిగే పరిస్థితి ఎక్కువవుతోందని.. అలాంటివాటిని ఉపేక్షించేది లేదన్నారు. వివాదాలకు తావివ్వకుండా పనిచేస్తామని తెలిపారు రాజేంద్రనాథ్ రెడ్డి.