మనిషి అడుగుపెట్టిన ప్రతిచోట సర్వనాశనం తప్ప ఇంకేమీ మిగలదనే సందేశాన్ని అవతార్ సినిమాలో చూపించాడు జేమ్స్ కామెరూన్. ఈ ఏడాది డిసెంబర్ లో అవతార్-2ను సిద్ధం చేస్తున్నాడు. ఈసారి నీటి అడుగున యుద్ధాలను చూపించబోతున్నాడు. ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ తో ఈ విషయం అర్థం అయింది. ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులతో పాటు కామన్ ఆడియెన్ కూడా అవతార్-2 కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.
అవతార్-2లో టైటానిక్ ఫేమ్ కేట్ విన్స్ లెట్ కూడా నటించింది. ఈ విషయాన్ని ఇన్నాళ్లూ గోప్యంగా ఉంచిన టీమ్.. తాజాగా ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది. నేవీ అధికారి రొనాల్ గా నటించిన కేట్ ఫస్ట్ లుక్ అందర్నీ సర్ ప్రైజ్ చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లుక్ వైరల్ అవుతోంది.
ప్రముఖ ఎంపైర్ మ్యాగజైన్ పై కేట్ ఫస్ట్‌లుక్ ప్రచురితమైంది. తన పాత్ర కోసం ఆమె నీళ్లలో ఉన్నప్పుడు ఎక్కువసేపు శ్వాస నిలుపుకోవడాన్ని ప్రాక్టీస్ కూడా చేసిందట. ఈ సినిమాలో విన్స్‌లెట్ తో పాటు సామ్ వార్తింగ్ టన్, జియో సాల్డనా, సిగర్నీ వేవర్ సహా పలువురు నటిస్తున్నారు.
అవతార్-2 ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16న విడుదల అవుతోంది. 160 భాషల్లో దీన్ని రిలీజ్ చేయనున్నారు. ఇక 2009లో అవతార్ విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 2.84 బిలియన్ డాలర్ల(సుమారు 30వేల కోట్లు)తో బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీ తర్వాత అవెంజర్స్ ఎండ్ గేమ్.. టాప్ 2లో నిలిచింది. ఇప్పుడు అవతార్ 2 ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.