కాట్రగడ్డ ప్రసూన, తెలంగాణ టీడీపీ ఉపాధ్యక్షురాలు
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా చేయకపోయినా ప్రతిపక్షాలన్నీ ఘనంగా నిర్వహించాయి. తెలంగాణ సాయుధ పోరాటాల గురించి నేటితరం వారికి అంతగా తెలియకపోవచ్చు. ఆనాటి నిజాం నవాబు నిరంకుశ పాలనపై, రజాకర్ల ఆకృత్యాలపై జరిగిన పోరాటాలు ఎన్నో ఉన్నాయి. భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత కూడా నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ తమది స్వతంత్ర రాజ్యమని, భారత్ లో విలీనం కాదలచుకాలేదని ప్రకటించాడు. దోపిడీ దొంగలు, కిరాయి హంతకులు, మానవ మృగాలకి ఏమాత్రం తీసిపోని విధంగా ఖాసిం రజ్వీ తయారుచేసిన రజాకార్లు అప్పటికే తెలంగాణపై పడి భయానక వాతావరణం సృష్టించారు. వారి చేతిలో వేలాది మంది ప్రజలు ధనమాన ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్.. అటు ఇండియాలో, ఇటు పాకిస్థాన్‌లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు నిజాం నవాబు. కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. అయినా భారత ప్రభుత్వంతో యుద్ధం చేసిన నిజాం నవాబు చివరకు దందం పెట్టాడు. భారతసేనల ధాటికి తట్టుకోలేక లొంగిపోతున్నట్లు ప్రకటించాడు. తన సంస్థానాన్ని భారత్ లో విలీనం చేయడానికి అంగీకరించాడు.
అప్పట్లో హైదరాబాద్ రేడియో ద్వారా నిజాం సంస్థానం భారత్ లో విలీనమైందని ప్రకటించారు. ఆరోజు 1948 సెప్టెంబర్ 17. అందుకే ఇదే రోజును రాష్ట్ర ప్రజలు తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.