జీవిత భాగస్వామి క్షేమాన్ని కోరుతూ మహిళలు కర్వాచౌత్ వేడుకలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి.. అమ్మవారికి పూజలు చేసి.. చంద్రుడి దర్శనం అనంతరం కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి విందులో పాల్గొంటారు.
ఇక పెళ్లి తర్వాత తొలిసారిగా జరుపుకునే ఈ వేడుకలను తాజాగా, బాలీవుడ్ కొత్త జంట కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తమ మొదటి కర్వాచౌత్ వేడుకలను అంతే ఘనంగా జరుపుకున్నారు. కత్రినా, విక్కీ గతేడాది డిసెంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లైన తర్వాత ఈ జంటకు ఇది మొదటి కర్వాచౌత్.
ఈ వేడుకలను కత్రినా అత్తవారింట్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘తొలి కర్వా చౌత్’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఫొటోల్లో ఈ జంట సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అదేవిధంగా కర్వాచౌత్ వేడుకలను బాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఐశ్వర్యా రాయ్, శిల్పాశెట్టి, మౌనీ రాయ్, రవీనా టాండర్, సోనమ్ కపూర్, ప్రీతి జింతా, ప్రియాంకచోప్రా తదితరులు వేడుకలను తమ ఇంట ఘనంగా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేశారు.