ఇది మరొకసారి బాధితుల్ని చేసే బాధాకరమైన తంతు - Tolivelugu

ఇది మరొకసారి బాధితుల్ని చేసే బాధాకరమైన తంతు

, ఇది మరొకసారి బాధితుల్ని చేసే బాధాకరమైన తంతుకత్తి మహేశ్, అనలిస్ట్

పల్లెల్లో, ఊర్లలో జరిగే రాజకీయాలే అసలు సిసలైన ప్రత్యక్ష రాజకీయాలు. అక్కడ ‘పార్టీలు కట్టడం’ అంటే మొత్తం జీవితాల్ని పార్టీల పంథాకు, ఉన్మాదానికి, వివక్షకు, ఆవేశాలకు బలిచెయ్యడం. అధికారంలో ఉంటే అహంకారం చూపించడం. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళని అణచివేయ్యడానికి ప్రయత్నించడం చాలా సహజ ధర్మంగా భావించే ప్రాంతాలు కొన్ని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. వాటిల్లో పల్నాడు ప్రాంతం ఒకటి.

ఈప్రాంతపు ఫ్యూడల్, ఫ్యాక్షన్ నేపధ్యం దీనికి కారణం. తెలుగుదేశం హయాంలో వైసీపీ బాధితులు ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం బాధితులు ఉంటారు. రెండు పార్టీల బాధితులకు కావలసింది సాంత్వన, ప్రజాస్వామికంగా బ్రతికే హక్కు. దీనికోసం పాటుపడాలసింది ఇరుపార్టీల బాధ్యత. గ్రామస్థాయిలో ఒత్తిళ్లకు, కక్షసాధింపులకి బలవుతున్న, బహిష్కరింపబడుతున్న క్యాడర్‌లో కార్యకర్తలలో ధైర్యాన్ని నింపడం అందరికీ అవసరం.

కానీ ఇప్పుడు జరుగుతున్నది ఈ రాజకీయ కాందిశీకులు మీద రాజకీయం. బాధితులను మరొకసారి బాధితుల్ని చేసే బాధాకరమైన తంతు. ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో జరిగిన అణచివేత తరువాత, వైఎస్సార్సీపీ శ్రేణులు గ్రామస్థాయిలో తెలుగుదేశం క్యాడర్‌ని భయభ్రాంతులకు గురిచేయడం చర్యకు-ప్రతిచర్య అనుకున్నా, ప్రభుత్వం పార్టీలకి అతీతంగా చట్టాల్ని రక్షించడం శాంతిభద్రతలని కాపాడటం ఒక బృహత్తర బాధ్యతగా నిర్వహించాలి అని కోరుకోవడం కూడా అంతే సహజం. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ దీన్ని రాజకీయ అవకాశంగా మలుచుకోవడానికి చేస్తున్న సన్నాహాల్ని పాలకపక్ష పార్టీగా తిప్పికొడుతూనే, ఒక ప్రభుత్వంగా మరింత కలుపుగోలు ధోరణితో వెళ్లడం అవసరం. సామరస్యంగా సమస్యను పరిష్కరించడం అవసరం.

“చలో ఆత్మకూరు” అంటూ పోటాపోటీగా ఆపార్టీ బాధితుల శిబిరాలు ఈపార్టీ ఏర్పాటు చేసి, ఈపార్టీ బాధితుల శిబిరాల్ని ఆ పార్టీ ఏర్పాటు చేసి మరింత ఉద్రిక్తత రగల్చడం, కక్షసాధింపుల్ని కొనసాగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇక్కడ ప్రతిపక్షం కన్నా పాలక పక్షం బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఒకసారి ప్రభుత్వంలోకి వచ్చాక కుల,మత, ప్రాంత,పార్టీలతో బేధం లేకుండా పౌరులందరినీ సమానంగా చూసుకుంటామని ముఖ్యమంత్రి జగన్ మాటిమాటికీ ఉటంకించడం అందరికీ తెలిసిందే. ఈ ఆశయాన్ని మనసా-వాచా-కర్మణా పాటిస్తే, ఈ సమస్యకి సహృద్భావ వాతావరణంలో సమాధానం లభిస్తుంది. సామాన్యుల్ని ఇబ్బందిపెట్టే 144 సెక్షన్ల కొనసాగింపు కాకుండా ఉంటుంది. ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుంది. రాజకీయాలకు అతీతమైన పాలనే లక్ష్యంగా సాగితే, ఈ కక్షసాధింపుల కొనసాగింపు అధికారంలో పార్టీలు మారినప్పుడల్లా పునరావృతం కాకుండా ఉంటాయి.

Share on facebook
Share on twitter
Share on whatsapp