తెలంగాణ కాంగ్రెస్ లో చేరికల పర్వం కొనసాగుతోంది. తాజాగా కత్తి కార్తీక త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతోంది. కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జీ మాణిక్యం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి,సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క,ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సమక్షంలో జులై 16న గాంధీ భవన్‌లో ఉదయం 11 గంటలకు చేరనున్నారు.
అయితే గతేడాది దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరుఫున కత్తి కార్తీక పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికలో ఆమెకు 363 ఓట్లు వచ్చాయి. ఈమె కెరీర్ ప్రారంభంలో రేడియో జాకీగా పనిచేశారు. తర్వాత ఓ తెలుగు ఛానల్ యాంకర్ గా పనిచేశారు.
తెలంగాణ యాసలో తనదైన ముద్ర వేసుకున్న ఆమె రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. దుబ్బాక ఎన్నికల తరువాత కొంతకాలం పాటు ఆమె సైలెంట్ గా ఉన్నప్పటికీ మళ్లీ రాజకీయాల్లోకి రావడం… అది కూడా కాంగ్రెస్ లో చేరడం వంటివి ప్రస్తుతం అటు రాజకీయంగానూ,ఇటు ప్రజల్లోనూ ఆసక్తి రేపుతున్నాయి.
ఎన్నికలు సమీపిస్తున్నవేళ అన్నిరాజకీయ పార్టీలు చాలా సీరియస్‌గా పనిచేస్తున్నాయి. ఈ తరుణంలోనే రేవంత్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ లో జోష్ పెంచుతోంది.టీఆర్ ఎస్, బీజేపీలకు చెక్ పెట్టేలా రేవంత్ రెడ్డి ఇటీవల బడా నేతలను పార్టీలో చేర్చుకోవాలని వ్యూహ రచన చేస్తున్నారు.
ఈ క్రమంలోనే పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలను పార్టీలోకి రప్పించగలిగిన రేవంత్… ఇకెందర్ని పార్టీలోకి తీసుకుని వస్తారో చూడాలి.