గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ పెరుగుతోంది. భవిష్యత్ లో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే.. అతని పై క్రిమినల్ కేసులు పెట్టాల్సిందేనని ప్రతిపక్ష నేతలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు.
సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి సరూర్ నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒక మహిళా గవర్నర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు యావత్ మహిళా లోకంపైన వ్యాఖ్యలుగా భావించడం, అందరిని అవమానపరిచినట్లే అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఇలాంటి మూర్ఖుడు ప్రజా ప్రతినిధిగా ఉండడానికి వీలు లేదని , తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేయడం జరిగింది.
ఇక ఇప్పుడు బీసి పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. అతని పై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ రాష్ట్ర డిజిపికి ఆదేశాలివ్వాలని ఆయన హెచ్ ఆర్ సీని కోరారు. గవర్నర్ తమిళి సై సౌందర్యరాజన్ ను ఉద్దేశించి తీవ్ర పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని ఆయన కోరారు. అత్యుత్తమ రాజ్యాంగ పదవీలో ఉన్న మహిళా గవర్నర్ ను కౌశిక్ రెడ్డి అగౌరవ పరిచారని..అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.
భవిష్యత్ లో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే కౌశిక్ రెడ్డిపై కఠిన చర్యలు తప్పని సరిగా తీసుకోవాలని హెచ్చార్సీ ని విజ్ఞప్తి చేశారు రాచాల యుగంధర్ గౌడ్. అయితే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గవర్నర్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ అసెంబ్లీ, కౌన్సిల్ లో పాస్ చేసిన బిల్లుల ఫైళ్లను ఇప్పటిదాకా తన సీటు కింద పెట్టుకొని కూర్చుంటారా అంటూ అనుచిత పదజాలాన్ని ఎమ్మెల్సీ ఉపయోగించడం ఇప్పుడు తీవ్ర దుమారానికి దారి తీస్తోంది. ఇలా ఓ మహిళా గవర్నర్ పట్ల మాట్లాడడం రాజ్యాంగమా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.