కేంద్ర బడ్జెట్ పై రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం పని చేస్తేనే మెరుగైన ఫలితాలు సాధ్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను నిర్వీర్యం చేస్తూ ఒంటెద్దు పోకడలతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. ఏ రంగాన్ని కూడా మేలు చేయని ఘోరమైన కేంద్ర బడ్జెట్ ఇది అన్నారు. కేంద్ర జనరల్ బడ్జెట్ లో రైల్వే బడ్జెట్ ను కలపడంతో అంతా గందరగోళం నెలకొందన్నారు.
కేంద్రం గత ఎనిమిదేళ్లలో 157 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా మంజూరు చేస్తే.. తెలంగాణ రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఇప్పుడేమో నర్సింగ్ కాలేజీలు ఇస్తామని కేంద్ర బడ్జెట్ లో చెప్తున్నారు. నర్సింగ్ కాలేజీలలో కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయమే జరుగుతుందని విమర్శించారు. రాష్ట్రంలోని కొత్త జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని గత తొమ్మిదేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నా దాని ఊసే లేకుండా పోయిందన్నారు వినోద్ కుమార్.
అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఇది కేంద్ర బడ్జేటా లేక కొన్ని రాష్ట్రాల కోసం పెట్టిన బడ్జెటా అని ప్రశ్నించారు. రెండేళ్లుగా చూస్తున్నామని తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. 197 నర్సింగ్ కాలేజీలు ప్రకటించారని.. ఒక్కటి కూడా తెలంగాణకు ఇవ్వలేదన్నారు.
కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కోసం రూ.5300 కోట్లు ఇచ్చారన్నారు. మరి కాళేశ్వరం, మిషన్ భగీరథ సంగతేంటని ప్రశ్నించారు. నీతి అయోగ్ చెప్పినా ఈ రెండు ప్రాజెక్టులకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు కవిత.