ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంచలనం రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసింది. వారిని ఇప్పటికే ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. తాజాగా ఈ కేసులో కేసీఆర్ తనయ, టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

గతంలో కవిత వ్యక్తిగత సహాయకుడు(పీఏ) నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది. తాజాగా ఆమెకు ఆడిటర్ గోరంట్ల అసోసియేట్స్ కార్యాలయంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో కవితకు ఈడీ అధికారులు నోటీసులు పంపినట్టు వార్తలు వస్తున్నాయి.
కవిత ఇటీవల కరోనా బారిన పడ్డారు. దీంతో ఆమె ఐసోలేషన్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఆమె సహాయకులకు ఈడీ అధికారులు ఈ మేరకు నోటీసులు అందజేశారని సమాచారం. దీంతో కరోనా తగ్గిన తర్వాత ఈడీ విచారణకు హాజరు కావాల్సి వుంటుందని తెలుస్తోంది.
ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని పలువురు వ్యాపార వేత్తల నివాసాల్లో ఈడీ దాడులు చేస్తోంది. కవిత పర్సనల్ ఆడిటర్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. గచ్చిబౌలిలోని అభినవ్ రెడ్డి నివాసంలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గతంలోనూ ఎమ్మెల్సీ కవిత పీఏగా ఆయన పనిచేశారు.