సీఎం కేసీఆర్ కు రాజకీయ ప్రయోజనాలు తప్పితే ప్రజల బాధలు పట్టడం లేదన్నారు తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం. ఈ సందర్భంగా ఆయన బుధవారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం అవినీతి మయంగా మారిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై చేస్తున్న పోరాటం కీలకమైందని అన్నారు. ‘టీఆర్ఎస్’.. బీఆర్ఎస్ గా మారి ఎటు పోవాలో అర్థం కాక కొట్టుమిట్టులాడుతోందని వ్యాఖ్యానించారు.
అసలు లిక్కర్ వ్యాపారంతో కవితకు ఏం పని అని ఆయన ప్రశ్నించారు. త్యాగాల పునాదిపై ఏర్పడిన పార్టీలో నుంచి తెలంగాణ పేరును తొలగించుకుని ఉద్యమకారులు, అమరులు, తెలంగాణ వాదాన్ని అవహేళన చేశారని మండిపడ్డారు. గడిచిన ఎనిమిదిన్నరేళ్లుగా రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డగోలుగా దోచుకుందన్నారు.
రాష్ట్రంలో నిధులను కొల్లగొట్టి బీఆర్ఎస్ గా అవతరించి మొత్తం రాజకీయ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఆందోళనలు చేస్తే అరెస్టులు చేసే కేసీఆర్.. ఢిల్లీ వెళ్లి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జనవరి 10న కృష్ణా జలాల సాధన కోసం నిరసన దీక్ష, 20వ తేదీన ధరణి సమస్యలపై సదస్సు నిర్వహించబోతున్నట్లు కోదండరాం వెల్లడించారు.
అలాగే జనవరి 30న విభజన హామీలపై ఢిల్లీలో సెమినార్ నిర్వహిస్తామని, 31న విభజన చట్టంలోని హామీల అమలుపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇస్తామన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు. పోడు భూముల రైతులకు న్యాయం, అర్హులైన రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం.