– ఉత్కంఠ రేపిన కవిత ఈడీ విచారణ
– ఉదయం ఈడీ టైమ్ కంటే ముందే లోపలికి!
– సాయంత్రం 6 గంటలకే వాహనాలు సిద్ధం
– కానీ, బయటకు రాని కవిత
– తగ్గేదే లేదన్నట్టు ఈడీ ప్రశ్నల వర్షం
– సిసోడియా, పిళ్లైతో కలిపి మీటింగ్స్ పై ఆరా
– 7, 8, 9.. గంటలు గడిచేకొద్దీ అంతా టెన్షన్
– మహిళా పోలీసుల మోహరింపుతో.. అరెస్ట్ అంటూ ప్రచారం
– రాత్రి 9.10 తర్వాత బయటకొచ్చిన కవిత
– రేపు మరోసారి విచారణ ఉంటుందని నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను రెండోసారి దాదాపు పది గంటలకు పైగా ప్రశ్నించారు ఈడీ అధికారులు. సోమవారం ఉదయం 10.25 గంటల నుంచి రాత్రి 9.10 గంటల వరకు విచారణ కొనసాగింది. ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక విక్టరీ సింబల్ చూపిస్తూ కనిపించారు కవిత. తనకు సపోర్ట్ గా అక్కడకు వచ్చిన వారికి అభివాదం చేశారు.
గత విచారణ సమయంలో రాత్రి 8 గంటలకు పంపించారు అధికారులు. కానీ, ఈసారి మరో గంట అదనంగా ఉంచారు. సాయంత్రం నుంచి ఈడీ కార్యాలయం దగ్గర హైటెన్షన్ నెలకొంది. 6 గంటలకే వాహనాలు సిద్ధం చేశారు కవిత అనుచరులు. ఇటు ఈడీ ఆఫీస్ దగ్గర మహిళా పోలీసులు, బలగాలను భారీగా మోహరించారు. దీంతో ఏం జరుగుగుందో అనే టెన్షన్ ఆ పరిసరాల్లో కనిపించింది.
ఈడీ ప్రశ్నలకు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ లేదని సమాచారం. కవిత, అరుణ్ పిళ్లై, సిసోడియాని కలిపి అధికారులు విచారించారు. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ పాత్రపై ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్ ఫ్రంటేషన్ పద్దతిలో కవితను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు.
సాయంత్రం 6 గంటలు దాటితే మహిళను విచారించకూడదని.. అది చట్ట విరుద్ధమని కవిత సుప్రీంకోర్టును ఇప్పటికే ఆశ్రయించారు. అయితే.. రెండోసారి విచారణలో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. రాత్రి 9.10 గంటల దాకా కవితను విచారించారు అధికారులు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు మరోసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు.