ఢిల్లీ లిక్కర్ స్కాం లో బుధవారం ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే కవిత నిన్న ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. 10 న జంతర్ మంతర్ వద్ద మహిళా రిజర్వేషన్లపై ఆమె దీక్ష చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో కవిత ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు మీడియా ముందుకు రానున్నారు.
అయితే నేటి విచారణ లేదన్నట్లుగానే సంకేతాలు వెలువడుతున్నాయి. కవిత 11న విచారణకు హాజరవుతానని ఈడీకి లేఖ రాశారు. కాగా విచారణకు సంబంధించి ఈడీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన ముందు వెలువడలేదు. దీంతో లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు ప్రెస్ మీట్ లో కవిత ఏం మాట్లాడబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది.
ఇక ఇలా ఉంటే.. కవిత రిక్వెస్ట్ పై ఈడీ అధికారులు ఈ రోజు ఉదయం స్పందించారు. మార్చి 11 వ తేదీన ఆమె విచారణకు వస్తానన్న దానికి ఈడీ అంగీకారం తెలిపినట్లు ఈమెయిల్ ద్వారా ఆమెకు రిప్లే అందింది. దీంతో ఉత్కంఠకు తెరపడింది. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఈ విలేఖరుల సమావేశం ఉండనుంది. ఈ ప్రెస్ మీట్ లో రేపు నిర్వహించబోయే జంతర్ మంతర్ వద్ద ధర్నా, ఈడీ నోటీసులపై కవిత మాట్లాడనున్నట్టు తెలుస్తోంది.