లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసులు అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె శనివారం ఉదయం ఈడీ ముందు హాజరయ్యారు. ఈడీ కార్యాలయం ముందు ఉన్న తమ నేతలకు, తన మద్దతుదారులందరికీ కవిత అభివాదం చేస్తూ ఈడీ కార్యాలయం లోపలికి కవిత వెళ్లారు. ఆమెకు మద్దతుగా ఈడీ ఆఫీసు గేటు వరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ ఎస్ నేతలు వచ్చారు.
కవిత ఈడీ విచారణకు హాజరవుతున్న క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీసు వద్ద 144 సెక్షన్ ను విధించినట్లు ఇప్పటికే అధికారులు పోస్టర్లు ఏర్పాటు చేశారు. కేవలం మీడియా వారికి మాత్రమే అధికారులు అనుమతినిచ్చారు. కార్యాలయం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు.
ఇప్పటికే రాజధాని నగరానికి బీఆర్ ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు మహిళా మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ లు ఢిల్లీలోనే ఉన్నారు. ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నా సంయమనం పాటించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు చేపట్టాలని గులాబీ పార్టీ భావిస్తోంది.