కవితకు ఈడీ షాక్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణకు హాజరు కావాల్సిందేనని ఈడీ తేల్చి చెప్పింది. అనారోగ్య కారణాలు, న్యాయస్థానంలో తన పిటిషన్ పెండింగ్‌లో వున్నందున విచారణకు హాజరు కాలేనని ఆమె చేసిన విజ్ఞప్తిని ఈడీ తోసిపుచ్చింది.
ఈ క్రమంలో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. కవిత విచారణకు హాజరవుతారా? ఆమె తదుపరి ఎలాంటి స్టెప్ వేయబోతున్నారనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఆమె విచారణకు హాజరు కాకపోతే ఈడీ ఏం చేయనుంది అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
కవిత ఈడీ విచారణకు హాజరయ్యే విషయంలో ఉదయం నుంచే హైడ్రామా నెలకొంది. మొదట ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆమె మీడియా ముందుకు వస్తారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత 10.30 గంటలకు వస్తారంటూ ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత 11 గంటలకు ఈడీ ఎదుట హాజరు కావాల్సి వున్న కేసీఆర్ నివాసం నుంచి ఆమె బయటకు రాలేదు.
ఈ రోజు ఉదయం సీఎం కేసీఆర్ నివాసంలో ఆమె మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులతో పాటు న్యాయ నిపుణులతో ఆమె భేటీ అయినట్టు తెలుస్తోంది. అనంతరం 11:30 గంటల సమయంలో ఈడీ కోరిన సమాచారాన్ని సీనియర్ న్యాయవాది, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్‌తో ఈడీ కార్యాలయానికి పంపించారు.