ఢిల్లీ లిక్కర్ స్కాం కు సంబంధించి ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు వెళ్లాల్సి ఉంది. కానీ, ఆమె ఈడీ ఆఫీస్ కు వెళ్లలేదు. చివరి నిమిషంలో ఆమె తరఫున బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ ను పంపారు. విచారణకు రాలేనని ఆయన ద్వారా మెసేజ్ పంపారు కవిత.
సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉందని.. అదీగాక, తనకు ఒంట్లో బాగోలేదని చెప్పారు. సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై.. ఈనెల 24న విచారణ జరగనుంది. అప్పటిదాకా విచారణకు రాలేనని కవిత స్పష్టం చేశారు. ఇప్పటిదాకా అడిగిన సమాచారాన్ని సోమా భరత్ ద్వారా పంపించారు కవిత.
మహిళను ఈడీ ఆఫీస్ కు పిలవొచ్చా లేదా అనే అంశంపై బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సందర్భంగా కీలక ఆరోపణలు చేశారు. ఫోన్ లాక్కున్నారని.. థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని.. బలవంతంగా వాళ్లకి కావాల్సినట్టు వాంగ్మూలం తీసుకుంటున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవిత ఈడీ విచారణకు వెళ్తారా? లేదా? అనే డౌట్ వ్యక్తమైంది.
అనుకున్నట్టే కవిత విచారణకు రాలేనని మెసేజ్ పంపారు. అయితే.. ఇవాళ్టి విచారణను కీలకంగా భావించింది ఈడీ. కన్ ఫ్రంటేషన్ పద్దతిలో ప్రశ్నించాలని ప్లాన్ చేసింది. బుచ్చిబాబు, పిళ్లై, సిసోడియాతో కలిపి కవితను విచారించాలని అనుకుంది. ఎందుకంటే.. ఈరోజుతో పిళ్లై కస్టడీ ముగిస్తుంది. అటు సిసోడియా కస్టడీ రేపటితో ముగియనుంది. ఇప్పుడు కవిత వెళ్లకపోవడంతో కన్ ఫ్రంటేషన్ లో విచారణకు ఛాన్స్ లేకుండా పోయింది. దీంతో ఈడీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.