లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. 8 గంటలుగా ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు కవిత. ఆఫీస్ పరిసరాల్లో 144 సెక్షన్ కొనసాగుతోంది. కవిత విచారణ సందర్భంగా ఈడీ కార్యాలయం దగ్గర హైటెన్షన్ నెలకొంది.
తెలంగాణ అడిషినల్ ఏజీ కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. అలాగే, మహిళా డాక్టర్ల బృందం లోపలికి వెళ్లింది. ఇవన్నీ జరుగుతున్న సమయంలోనే ఈడీ కార్యాలయానికి ఢిల్లీ పోలీస్ ఎస్కార్ట్ వాహనం చేరుకుంది. దీంతో అనేక అనుమానాలు తెరపైకి వస్తున్నాయి.
విచారణ చేస్తున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కవిత న్యాయవాది సోమా భరత్ ను కూడా ఈడీ అధికారులు పిలిచారు. ఆయన కూడా లోపలికి వెళ్లారు. కవితను అరెస్ట్ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారిస్తున్న వేళ.. బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ శ్రేణులకు కీలక సందేశమిచ్చారు. కష్టసుఖాల్లో కలిసినడుస్తూ.. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ పల్లెల్లో… గల్లీల్లో గులాబీ పతాకాన్ని రెపరెపలాడించి తనకు కొండంత అండగా నిలిచారని.. మీ రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేనని అన్నారు. ‘‘ఇతరులకు పాలిటిక్స్ అంటే గేమ్.. బీఆర్ఎస్ కు మాత్రం టాస్క్’’.. రాజకీయాన్ని ప్రజల ఆకాంక్షలను నెరవెర్చే పవిత్ర కర్తవ్యంగా భావించి కొత్తపంథాలో నడుస్తూ కోటి ఆశలతో ఏర్పడ్డ తెలంగాణను కోటి కాంతులు విరజిమ్మే నేలగా తీర్చిదిద్దుకున్నామని అన్నారు కేసీఆర్.