ఈడీ ఆఫీస్ లో ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. సోమవారం 10 గంటలపాటు విచారించిన ఈడీ.. ఇవాళ ఎన్ని గంటలు ఆరా తీస్తుందో తెలియడం లేదు. ఈడీ ధ్వంసం చేశారని ఆరోపించిన 10 ఫోన్లను తీసుకుని కవిత లోపలికి వెళ్లడం ఆసక్తిని పెంచింది. దీంతో ఏ క్షణం ఏం జరుగుతుందో అనే టెన్షన్ నెలకొంది.
ఈ స్కాంలో పాల్గొన్నవారు 170 ఫోన్లు మార్చారని ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే అరెస్ట్ అయినవారి ఫోన్లను స్వాధీనం చేసుకున్న అధికారులు.. 17 ఫోన్లలో ఉన్న డేటాను సేకరించారు. నిందితులు ఫోన్లలో డేటా అందకుండా రూ.1.30 కోట్ల విలువైన ఫోన్లను ధ్వంసం చేశారని ఈడీ చెబుతోంది. అలా కవితపైనా అభియోగాలు మోపారు అధికారులు. దీంతో ఆమె తన ఫోన్లను తీసుకుని ఇవాళ విచారణకు హాజరయ్యారు.
కవిత విచారణ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ సహా పలువురు కీలక నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. ఉదయం కవిత వెంట ఈడీ ఆఫీస్ కు కొందరు వెళ్లారు. ప్రస్తుతం ఈడీ ఆఫీస్ దగ్గరకు భారీగా జాగృతి, బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. ఢిల్లీ పరిణామాలపై పార్టీ ముఖ్య నాయకత్వం ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. ఫోన్ల విషయంలో ఈడీని, బీజేపీని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకం అనేది ఈడీ వాదన. ఇందులో పెద్ద ఎత్తున కవిత పెట్టుబడులు పెట్టినట్టు అధికారులు అంటున్నారు. అరెస్టైన వారి కేసు చార్జ్ షీట్ లోనూ కవిత పేరు చేర్చారు. గత నెల రోజులుగా కవితను మూడు సార్లు విచారించారు. కవిత పాత్రకు సంబంధించి పలు లీకులు కూడా బయటకు వచ్చాయి. సోమవారం సుదీర్ఘంగా విచారించిన అధికారులు.. ఇవాళ కూడా ప్రశ్నిస్తున్నారు.