– లిక్కర్ కేసులో ఈడీ ముందుకు కవిత
– 9 గంటలపాటు విచారణ
– కవితను ప్రశ్నించిన ఐదుగురు అధికారుల బృందం
– రామచంద్ర పిళ్లైతో కలిసి విచారణ
– ముఖ్యంగా సెల్ ఫోన్ల ధ్వంసంపై ఆరా
– హైదరాబాద్ మీటింగులపైనా ప్రశ్నలు?
– మహిళా అధికారి సమక్షంలో వీడియో రికార్డ్
– మరోసారి కవితకు ఈడీ నోటీసులు
– 16న రావాలని ఆదేశాలు
లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సుదీర్ఘంగా విచారించారు ఈడీ అధికారులు. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీస్ లోకి ఎంటర్ అయితే.. రాత్రి 8 గంటలకు బయటకు పంపారు. మధ్యలో కాసేపు లంచ్ బ్రేక్ ఇచ్చారు. 9 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ విచారణలో కవితకు అనేక ప్రశ్నలు వేశారు అధికారులు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోని ఐదుగురు అధికారులు కవితను విచారించారు. మహిళా అధికారి సమక్షంలో వీడియో షూట్ చేయించారు.
ఈ కుంభకోణంలో కవిత పాత్ర, నిందితులతో ఉన్న సంబంధాలు, ఇండో స్పిరిట్స్ కంపెనీలో వాటాలు సహా పలు విషయాలపై ఈడీ ప్రశ్నలు వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు లిక్కర్ స్కాంలో కవిత పాత్రపై సేకరించిన ఆధారాలతో విచారణను కొనసాగించారు అధికారులు. ఆమెతో పాటు రామచంద్ర పిళ్లై కూడా విచారణకు హాజరయ్యారు. అయితే.. విచారణ అనంతరం కార్యాలయం నుంచి బయటకొచ్చిన కవితకు అప్పటికే అక్కడ భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా ఆమె ఢిల్లీలోని సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ కవితకు దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లారు బీఆర్ఎస్ నేతలు.
కవిత విచారణ సందర్భంగా ఢిల్లీలో హైటెన్షన్ నెలకొంది. ఉదయానికే భారీగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకుని ఈడీ ఆఫీస్ దగ్గరకు వెళ్లారు. అయితే.. పోలీసులు ఆ పరిసరాల్లో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి ధర్నాలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. కవితను అరెస్ట్ చేస్తే భారీగా ధర్నాలు చేయాలని ప్లాన్ చేశారు బీఆర్ఎస్ నేతలు. దీనకోసం ఆప్ నేతలతో సంప్రదింపులు కూడా చేశారు. కవిత విచారణ ముమ్మాటికీ కక్ష సాధింపేనని బీఆర్ఎస్ నేతలు బీజేపీని టార్గెట్ చేశారు. మరోవైపు కవితకు మరోసారి నోటీసులు జారీ చేశారు ఈడీ అధికారులు. ఈనెల 16న ఇంకోసారి విచారణ ఉంటుందని స్పష్టం చేశారు.