హస్తినలో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ విచారణను ఎదుర్కోబోతున్న తరుణంలో హైదరాబాదులో పోస్టర్లు, ఫ్లెక్సీలు హల్ చల్ చేస్తున్నాయి. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను అడ్డు పెట్టుకొని బీజేపీ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని అర్థం వచ్చేలా ఉన్న ఈ పోస్టర్లు, ఫ్లెక్సీలు పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి.
బీజేపీలో చేరకముందు.. చేరిన తర్వాత అంటూ.. వెలిసిన ఈ పోస్టర్లు, ఫ్లెక్సీల్లో పలువురు నేతలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొని సీబీఐ, ఈడీ రెయిడ్స్ జరిగి తరువాత.. కాషాయరంగు కండువా కప్పుకొని బీజేపీలో చేరిపోయారంటూ ఉంది. ఈక్రమంలో ప్రస్తుత కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింధియా, అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ, వెస్ట్ బెంగాల్ బీజేపీ ముఖ్యనేత సువేంధు అధికారి, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త ఎంపీ సుజనా చౌదరి, కేంద్ర మాజీ మంత్రి నారాయణ్ రాణె ఫొటోలున్నాయి అందుల్లో ఉన్నాయి.
ఇక మరో కొసమెరుపు ఏంటంటే.. ఎమ్మెల్సీ కవిత రెయిడ్స్ కి ముందు తర్వాత ఎలాంటి మరక అంటకుండా ఉన్నారంటూ అర్థం వచ్చేలా కూడా ఆ ఫ్లెక్సీలు, పోస్టర్లలో ఉంది. పోస్టర్ల కింద.. నిజమైన రంగులు వెలసిపోవు అంటూ కొటేషన్ పెట్టడం మరింత ఆసక్తికరంగా మారింది. ఇది ఇలా ఉంటే..పోస్టర్ల చివర్లో బై బై మోడీ అంటూ హాష్ టాగ్ పెట్టారు.
మరో వైపు ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఈడీ ముందు విచారణకు హాజరు కానున్నారు. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే కవితను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా లేకపోలేవని సీఎం కేసీఆర్ నిన్ననే ప్రకటించడంతో.. కవిత అరెస్ట్ కు ముందుగానే రంగం సిద్ధమైందా అనే అనుమానాలకు బలం చేకూరుతుంది.