ఉగాది పండుగ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు తన భర్తతో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేస్తూ విషెస్ చెప్పారు. అయితే.. ఈ ట్వీట్ చేసిన తర్వాత ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. ఆమె వెంట మంత్రి కేటీఆర్ తో పాటు హరీష్ రావు, మరికొందరు పార్టీ నేతలు ఉన్నారు. హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాక.. నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లారు కవిత.
సీఎం కేసీఆర్ తో భేటీ అయిన కవిత.. మూడు రోజులుగా ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించారు. ఈడీ విచారణ జరిగిన తీరును వివరించినట్టు సమాచారం. 20, 21వ తేదీలలో ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలు, ఇచ్చిన సమాధానాన్ని కేసీఆర్ కు ఆమె వివరించినట్టు తెలుస్తోంది. ఎన్ని ప్రశ్నలు అడిగారు.. ఎన్నింటికి సమాధానం చెప్పారు.. సమాధానం తర్వాత వాళ్లు ఎన్ని గంటలు వెయిటింగ్ చేయించారు.. ఇంకా ఏమైనా వివరాలు అడిగారా? అన్నింటినీ పూసగుచ్చినట్టు తండ్రికి కవిత వివరించినట్టు సమాచారం.
ఇటు విచారణ తీరు సరిగ్గా లేదని సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ 24న విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో దీనిపైనా కేసీఆర్ తో కవిత చర్చించారట. 20న 10 గంటలపాటు విచారించిన ఈడీ అధికారులు.. 21న కూడా సుదీర్ఘంగా ప్రశ్నించారు. మొత్తం మూడు విడతల్లో 28 గంటల పాటు ఈడీ విచారణ ఎదుర్కొన్నారు కవిత.
విచారణకు హాజరయ్యే ముందు కవిత తన ఫోన్లను మీడియాకు చూపించారు. ఫోన్లను ధ్వంసం చేశారన్న ఈడీ ఆరోపణలను ఖండిస్తూ ఆమె తన ఫోన్లను మీడియాకు చూపించారు. తనపై ఈడీ కావాలనే దురద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోందన్నారు. లిక్కర్ కేసులో ఫోన్స్ వ్యవహారం ప్రధాన టాపిక్ గా మారింది. వాటిని ధ్వంసం చేశారని సీబీఐ, ఈడీ చార్జీషీట్లలో తెలిపాయి. అయితే.. అవి పగలగొట్టలేదని తనకే ఫోన్స్ మార్చడం ఇష్టమనే విధంగా అన్నింటినీ ఈడీకి ఇచ్చారు కవిత.