టీఆర్ఎస్ నేత నరేందర్ మృతిపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తెలుసుకున్న ఆమె.. తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. నరేందర్ భౌతికకాయానికి నివాళులర్పించారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమం వేదిక దగ్గర చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. నరేందర్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు కవిత.
వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాట్లు చేశారు. పార్టీ శ్రేణులు అంతా దీనికి సిద్ధం చేశారు. మధ్యాహ్నం ఈ ఆత్మీయ సమ్మేళనం జరగాల్సి ఉంది. కానీ, ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర బీఆర్ఎస్ నాయకులు ఉత్సాహంతో నృత్యాలు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారు రజిని భర్త నరేందర్ కూడా ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు.
అయితే.. ఉన్నట్టుండి నరేందర్ తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. వెంటనే, స్పందించిన బీఆర్ఎస్ నేతలు హుటాహుటిన నరేందర్ ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. నరేందర్ మృతితో బీఆర్ఎస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది.
నరేందర్ మృతి విషయం తెలిసి కవిత దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. నరేందర్ మృతి నేపథ్యంలో తన కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు కవిత.