ఈడీ విచారణ తర్వాత హైదరాబాద్ వచ్చిన ఎమ్మెల్సీ కవిత స్పీడ్ పెంచారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఇందులో అందరూ కలిసికట్టుగా రావాలని పిలుపునిచ్చారు. ఈ నవరాత్రిన అడ్డంకులను ఛేదించడానికి మహిళలు తమ పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి.. సాధికారత కల్పించడానికి కలిసి పని చేద్దామన్నారు.
చట్టసభల్లో తమకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు కవిత. తామేమీ ఎక్కువ కోరడం లేదని 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోరాటాన్ని ఈమధ్య కాలం నుంచి వేగవంతం చేశారు కవిత. ఢిల్లీలో ఒక రోజు దీక్ష కూడా చేశారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లును ఆమోదింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వానికి మెజార్టీ ఎంపీలు ఉన్నా కూడా మహిళా బిల్లుపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు కవిత.
లిక్కర్ స్కాం కు సంబంధించి ఈడీ విచారణ కోసం మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లారు కవిత. 20, 21 తేదీల్లో రెండు రోజులు విచారించారు అధికారులు. తదుపరి విచారణపై క్లారిటీ ఇవ్వకపోవడంతో తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. వచ్చిన వెంటనే నేరుగా ప్రగతి భవన్ కు వెళ్లారు కవిత. సీఎం కేసీఆర్ తో భేటీ అయి.. మూడు రోజులుగా ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించారు.
ఈడీ విచారణ జరిగిన తీరును సీఎంకు వివరించినట్టు సమాచారం. 20, 21వ తేదీలలో ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలు, ఇచ్చిన సమాధానాన్ని కేసీఆర్ కు ఆమె వివరించినట్టు తెలుస్తోంది. ఎన్ని ప్రశ్నలు అడిగారు.. ఎన్నింటికి సమాధానం చెప్పారు.. సమాధానం తర్వాత వాళ్లు ఎన్ని గంటలు వెయిటింగ్ చేయించారు.. ఇంకా ఏమైనా వివరాలు అడిగారా? అన్నింటినీ పూసగుచ్చినట్టు తండ్రికి కవిత వివరించినట్టు సమాచారం.