రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ గవర్నర్ కు కౌంటర్ ఇచ్చారు. ఓ జర్నలిస్ట్ పోస్ట్ ను రీట్వీట్ చేసిన కవిత తమిళిసై కు చురకలంటించారు.
‘‘కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ సెంట్రల్ విస్టా మీద కంటే, దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కానీ, కేంద్రం మాత్రం కొందరి ఎదుగుదలపై మాత్రమే దృష్టి పెట్టింది. అలా కాకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాటం చేస్తున్నాం. కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారో గవర్నర్ తన ప్రసంగంలో అవే అడిగినందుకు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు కవిత.
ఇక తెలంగాణలో ప్రజాస్వామ్యం అమలవుతుందన్నారు కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అభివృద్ధిని గుర్తించకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. వ్యవసాయ క్షేత్రాలు, కొత్త భవనాలపై విమర్శలు చేయడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న వారు.. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఏం చేసిందని ప్రశ్నిస్తే.. జాతీయ రహదారుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారని విమర్శించారు.
తమిళిసై ఏమన్నారంటే..?
రాజ్యాంగ స్ఫూర్తితో తెలంగాణ ఏర్పడిందని, ఎంత కష్టమైనా ప్రజల కోసం పని చేస్తానని తమిళిసై చెప్పారు. ఆరు దశాబ్దాల పాటు ప్రజల పోరాటంతో రాష్ట్రం వచ్చిందన్నారు. రైతులకు పొలాలు, ఇళ్ళు ఉండాలి గానీ ఫాంహౌజ్ లు కాదని, అది అభివృద్ధి కాదని తెలిపారు. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు మన విద్యాసంస్థల్లో ఉండడమే నిజమైన అభివృద్ధి.. అంతే తప్ప మన పిల్లలు మాత్రమే విదేశాల్లో చదువుకోవాలన్నది నిజమైన ప్రగతి కాదు అని వ్యాఖ్యానించారు. తెలంగాణాలో సగటున రోజుకు 22 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు తమిళిసై.