బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం ఉదయం బల్కంపేట అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తన తండ్రి కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కవిత అమ్మవారి ఆలయంలో రాజశ్యామల పూజ చేయించారు.
ఈ సందర్భంగా ఆమె బల్కంపేట ఎల్లమ్మకు బంగారు ఆభరణాలు సమర్పించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నానని అన్నారు. బల్కంపేట అమ్మవారి ఆలయం రోజురోజుకు అభివృద్ది చెందుతోందని, భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కవిత పేర్కొన్నారు.
కాగా కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు ఘనంగా జరుపుతున్నారు. పలు కార్యక్రమాలను చేపట్టారు. రక్తదాన శిబిరాలు, నిరుపేదలకు ఆహారం, దుస్తుల పంపిణీ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ కు రాష్ట్రవ్యాప్తంగా శుభాకాంక్షలు తెలుపుతూ అనేక చోట్ల హోర్టింగ్ లు ఏర్పాటు చేశారు.