ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. సీబీఐ నుంచి తనకు వచ్చిన నోటీసులపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎఫ్ ఐ ఆర్,సీబీఐకి.. కేంద్రం ఇచ్చిన ఫిర్యాదు పత్రాలను తనకు ఇవ్వాలని సీబీఐ అధికారికి లేఖ పంపారు. డాక్యుమెంట్లు ఇస్తే వేగంగా సమాధానాలు ఇచ్చేందుకు వీలవుతుందని.. డాక్యుమెంట్లు అందిన తరువాత హైదరాబాద్ లో విచారణ తేదీ ఖరారు చేయవచ్చని ఆ లేఖలో ఆమె పేర్కొనడం ట్విస్ట్ గా మారింది.
అయితే ఢిల్లీ లిక్కర్ స్కాంలో.. క్లారిటీ కోసం కవితను విచారించాలనుకుంటున్నామని సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ద్వారా సీబీఐ శుక్రవారం రోజున ఆమెకు సమాచారం అందించింది. సీబీఐ అవినీతి నిరోధక విభాగం డీఎస్పీ అలోక్ కుమార్ షాహి ఈ నోటీసులు జారీ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈనెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లో కానీ, ఢిల్లీలో కానీ మీ నివాసంలో విచారించాలని అనుకుంటున్నాం. మీరు ఎక్కడ సౌకర్యంగా ఉంటుందో దయచేసి తెలియజేయండి. విచారణ సమయంలో వెలుగులోకి వచ్చిన విషయాల గురించి మీకు తెలిసి ఉండొచ్చు. దర్యాప్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ అంశాలపై మిమ్మల్ని విచారించాల్సిన అవసరం ఏర్పడిందని.. నోటీసులో పేర్కొన్నారు.
కేంద్ర హోం శాఖ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ రాయ్ నుంచి వచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదు మేరకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియాతో పాటు మరో 14 మందిపై కేసు నమోదైనట్లు కూడా కవితకు సీబీఐ పంపించిన నోటీసులో ఉంది.
అయితే సీబీఐ నోటీసులు జారీ అయిన విషయాన్ని కవిత శుక్రవారం రోజునే ధ్రువీకరించారు. నా వివరణ కోరుతూ సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ నోటీసులు జారీ చేసిందని..వారి అభ్యర్థన మేరకు ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్ లోని తన నివాసంలోనే కలుసుకోవచ్చని అధికారులకు తెలియజేశానని..ఆమె అన్నారు. అయితే ఇప్పుడామె ఎఫ్ఐఆర్, సీబీఐకి కేంద్రం ఫిర్యాదు పత్రాలను అందజేయాలని… అప్పుడే తనను విచారించాలని లేఖ పంపడం ట్విస్ట్ ను క్రియేట్ చేసింది.