ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరోసారి అరెస్టులకు దిగాయి దర్యాప్తు సంస్థలు. హైదరాబాద్ కు చెందిన గోరంట్ల బుచ్చిబాబును అదుపులోకి తీసుకుంది సీబీఐ. ఈయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దగ్గర గతంలో ఛార్టెడ్ అకౌంటెంట్ గా పని చేశాడు. ఢిల్లీలో గోరంట్లను అరెస్ట్ చేసింది సీబీఐ.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని.. హైదరాబాద్ కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. గతంతో దోమలగూడ అరవింద్ నగర్ లో ఉన్న బుచ్చిబాబు ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అప్పుడు లభించిన డాక్యుమెంట్స్ ఆధారంగా సీబీఐ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈమధ్యే ఈ స్కాంకు సంబంధించి ఈడీ రెండో ఛార్జ్ షీట్ కోర్టు ముందుకు వచ్చింది. అందులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పేరు ఉండడం చర్చనీయాంశమైంది. అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, సమీర్ మహేంద్రు, శరత్ చంద్రా, విజయ్ నాయర్, బినోయ్ బాబు సహా మొత్తం 17 మందిపై ఈడీ అభియోగాలు మోపింది. ఢిల్లీ మద్యం కుంభకోణం నుంచి వచ్చిన డబ్బును ఆప్ గోవాలో ఎన్నికల ప్రచారానికి వాడిందని పేర్కొంది.
ఇక సాక్ష్యాలు ధ్వంసం చేసిన వారిలో ఎమ్మెల్సీ కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. అలాగే విచారించిన జాబితాలో కూడా ఆమె పేరు ఉంది.