ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించాలని ఎమ్మెల్సీ కవితతో పాటు పలు పార్టీల నేతలు డిమాండ్ చేశారు. కాని కేంద్రం పట్టించుకోకపోవడంతో ఆందోళనను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. దీంతో దేశవ్యాప్తంగా మహిళా బిల్లుకు మద్దతుగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు.
ఇప్పటికే జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్ష చేయడంతో పాటు దాదాపు 18 పార్టీలతో, పలు మహిళా సంఘాలతో భారత జాగృతి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించింది. ఇక ఇప్పుడు మిస్డ్ కాల్ కార్యక్రమంతో పాటు యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించాలని అనుకుంటున్నారు.
వచ్చే నెల నుంచే వీటిని చేపట్టాలని కవిత ప్లాన్ చేస్తున్నారు. ఈ బిల్లుకు మద్దతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, మేధావులకు కవిత లెటర్స్ పంపనున్నారు. మహిళలకు సాధికారత కల్పిద్దాం.. దేశానికి సాధికారత కల్పిద్దాం అంటూ మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండని కవిత పిలుపు నిచ్చారు.
ఇక “మహిళా ప్రాధాన్యత బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదు” అంటూ ఆమె పోస్టర్లలో పేర్కొన్నారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.