చంద్రబాబు గతానుభవాన్ని గుర్తుచేసుకుంటున్న వైసీపీ కేడర్
మోడీ-షా ద్వయాన్ని ఎదుర్కొనే సత్తా వుందా.. పరిశీలకుల విశ్లేషణ
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలిసో, తెలియకో పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉచ్చులో పడిపోతున్నారా..? అంతర్రాష్ట్ర వివాదాలు అనేకం వుండగా, అవేమీ తేల్చుకోకుండా కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వాలన్న కేసీఆర్ ఆలోచనలో భాగస్వామి అయిపోతున్నారా? నిన్న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ తరువాత జనం నుంచి వినవస్తున్న వ్యాఖ్యలు ఇవి..
నిన్న రాత్రి ఇద్దరు సీఎంల సమావేశం ఏకాంతంగా జరిగింది. ఇందులో కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ దూకుడుపైనా చర్చించారని సమాచారం. ఇటీవలి కాలంలో కేసీఆర్ తన రాష్ట్రంలో ముప్పిరిగొన్న అనేకానేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నుంచి ముంచుకొస్తున్న ముప్పును ఊహిస్తూ ఎప్పుడూ లేనంత కలవరపాటుకు గురవుతున్నారు. ఇది చాలదన్నట్టు సొంత పార్టీలో అసంతృప్తుల సెగలు అంతకంతకూ ఎక్కువవుతున్నాయి. మంత్రివర్గ విస్తరణతో ప్రస్తుతానికి దీన్ని కట్టిపెట్టామని అనుకున్నా.. పదవులు దక్కని శాసనసభ్యులు బాహాటంగానే నోరు విప్పి కేసీఆర్ వైఖరిపై అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మరోపక్క రాష్ట్రంలో యూరియా సమస్య, రైతుల ఆత్మహత్యలు, రాష్ట్రమంతటా విషజ్వరాలు వంటి ప్రజా సమస్యలు హోరెత్తుతున్నాయి. ఈ దశలో తనకు పక్కలో బల్లెంలా తయారైన బీజేపీతో పోరుకు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రిని పావులా వాడుకుంటున్నారనే మాట వొకటి బాగా వినిపిస్తోంది. కేంద్రంతో ఉమ్మడి పోరాటం పేరుతో ఏకాంతంగా జరిపిన చర్చలు రేపు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయోనని ఇటు వైసీపీ శ్రేణులు ఆందోళనతో వున్నాయి. గతంలో ఇలాగే తమను ఎదిరించి నిలిచిన అప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని మోదీ-షా ద్వయం ఎలా ఇరుకునపడేసి అధికారం నుంచి దూరం చేసిందీ గుర్తుచేసుకుని ప్రస్తుత పరిణామాలు ఎలాంటి మలుపులకు దారితీస్తాయోనని వైసీపీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
ఇలావుంటే, నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు జరిపిన ఏకాంత చర్చల్లో మోడీ-షా ద్వయం దూకుడును ఎదుర్కొనే వ్యూహంపై కసరత్తు చేసినట్టుగా సమాచారం. దక్షిణాదిలో.. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తరించడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునే వ్యూహంపై ఇద్దరు సీయంలు మాట్లాడుకున్నట్లు తెలిసింది. అవసరమైతే తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో ఉమ్మడిగా కలిసికట్టుగా పనిచేయాలని అనుకున్నట్లు సమాచారం.