సీఎం కేసీఆర్ మెడపై ప్రధాని నరేంద్ర మోడీ పెట్టిన కత్తేంటి..? కత్తితో భయపెట్టగానే గజగజ ఆయన వణికిపోయి వరి ధాన్యం కొనకపోయినా పర్లేదని కాగితం రాసి, సంతకం పెట్టి ఇచ్చిండు. “కత్తి పెడితే ఏం చేస్త…? గతి లేక రాసిచ్చిన” అని కేసీఆర్ అంటున్నడు. సరే.. ఏం చేస్తడో.. ఏం చేయడో మనకు తెల్వదా గానీ.. ఇంతకూ.. మోడీ పెట్టిన కత్తేందనేది ఇప్పుడు పెద్ద డౌటు. ఎంతపెద్ద కత్తి పెడితే కేసీఆర్ భయపడ్డడు..? లేకపోతే ఉట్టిగనే భయపడ్తడా..? కేసీఆర్ తల్చుకుంటే ఢిల్లీలో మోడీని మెడలు వంచుతడు, దేశంలో అగ్గివెడ్తడు, గత్తర లేపుతడు.. అటువంటి కేసీఆర్ భయపడ్డడంటే.. చిన్న ముచ్చట్నా..? పెద్ద తతంగమే. ఆషామాషీ డుల్ ముల్ పంచాయితీ అయితే కాదు. అసలు.. ఏమా కథా కమామీషు.
రైతుల జీవితాలు రాసిచ్చి.. ఇప్పుడు రంకెలు
కేసీఆర్ మాటలతోని ఎవర్నైనా కన్విన్స్ చేస్తడని అంటరు. నిజమే… చాలాసార్లు మాటలతోనే కడుపు నింపుతడు. అసోంటిది… రైతుల కోసం ఖాస్ దోస్త్ మోడీని ఎందుకు కన్విన్స్ చేయలేకపోయిండు..? ఎట్లాగో ప్రతీ బిల్లుకు మద్దతు ఇయ్యనేవట్టే… మంత్రివర్గంలో చేరలేదన్నట్టే గానీ.. మోడీని మిత్రపక్షం కంటే ఎక్కువ కాపాడుకోవట్టే. రైతు వ్యతిరేక చట్టాలపై ఢిల్లీ రోడ్లపై ఏడాదిన్నర పాటు.. అన్నదాతలు ఉద్యమిస్తే కనీసం సంఘీభావం తెలిపిరాకపాయె. అయినా.. మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంల.. కేసీఆర్ ఎట్ల పాల్గొంటడు..? ఇచ్చంత్రం కాకపోతే.. మర్యాద పాటించిండు అంతే. రైతులకు మద్దతు తెలిపివస్తా అని చెప్పే పోయిండు కానీ.. ఢిల్లీ పోయినంక ఏమైందో ఏమో..? మోడీ, అమిత్ షాను కలిసి… వచ్చిండు. ఉత్త చేతులతోని పోలేదు.. శాలువాలు తీసుకపోయిండు… మిత్రుల భుజాలపై కప్పి.. శభాష్ అని జబ్బలు చరిచి.. మెచ్చుకుని వచ్చిండు. కానీ.. ఇప్పుడెందుకో రంకెలు వేస్తున్నడు..!
దారుణం.. సొల్లు పురాణం
బీజేపీ వాళ్లు ఏదేదో మాట్లాడుతున్నరు. రైతుల నుంచి ధాన్యం కొంటమని మాత్రం చెప్తలేరు. కేసీఆర్ కూడా ఏదేదో మాట్లాడుతున్నడు. కానీ… కేంద్రానికి లేఖ ఎందుకు రాసిచ్చిండో చెప్తలేడు. “మెడ మీద కత్తి పెట్టడం వల్లనే రాసిచ్చిన” అని ఏదో అంటుండు. కానీ.. అదంత లాజిక్ గా అనిపిస్తలేదు. “చెప్పేటోడు చెముటోడైతే… ఇనేటోనికన్నా ఇజ్జత్ ఉండాలె కదా!” అని కేసీఆర్ అంటడు. ఇప్పుడది ఓసారి గుర్తు చేసుకోవాలె మనం. బీజేపీ రైతు హంతక పార్టీ అని, కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి… 750 మంది రైతుల్ని పొట్టన పెట్టుకుందని… దేశంలో వ్యవసాయాన్ని అంబానీ, అదానీ చేతుల్లో పెడుతోందని కేసీఆర్ అంటున్నడు. ఇదే మాటల్ని ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు దేశమంతా వినపడేంత గట్టిగా అన్నరు. కానీ.. కేసీఆర్.. నువ్వేమైనా తక్కువనా.. నువ్వూ ఆ కమలంలో రేకువు కాదా అంటున్నరు తెలంగాణ జనం. నీ సంగతేందో చెప్పు ముందు అని నిలదీస్తున్నరు. “కేంద్రం కొననన్నది, నేను కూడా కొనను” అంటున్న కేసీఆర్.. ఇదేనా నీ బాధ్యత? ఊరంతా మునుగుతున్నది అని తండ్రి ఊరుకుంటడా? నా బిడ్డల్ని ఎట్ల కాపాడుకోవాలనే అనుకుంటడు కదా? వాన పడితే కోడి కూడా తన రెక్కల కింద పిల్లల్ని కాపాడుకుంటది. కానీ నువ్వేమంటున్నవ్ “బీజేపీ సర్కారు దేశం మొత్తాన్ని ముంచుతోంది. మనం కూడా మునగాల్సిందే. నేను కూడా మీకిచ్చే సలహా ఇదే” అని అంటున్నవ్ అంతే కదా సారూ…? ఇంత దారుణంగా మాట్లాడుడు కరెక్టేనా? ఇమాందారీగా చెప్పు నువ్వే అని అడుగుతున్నరు.
దొందూ దొందే
రైతులు పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి, కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం కొనను అన్నదట.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనదట. కేంద్రం దిగివచ్చే వరకు యుద్ధం చేస్తానని మళ్లీ అన్నడు కేసీఆర్. సంకలో కూసుని శంఖారావాలు చేసుడే కానీ యుద్ధం లేదు ఏమీ లేదు. అయితే ఇక్కడ గమనించాల్సిందేంటంటే… ఆగస్టులో కేంద్ర ప్రభుత్వం ఓ వింత, దారుణమైన ప్రతిపాదన చేసింది. యాసంగిలో రైతుల నుంచి పంట కొనుగోలు చేయబోం. మీరు ఇందుకు అంగీకరించాలి. పోయిన సీజన్ లో మీరు రైతుల నుంచి సేకరించిన ధాన్యం కొంత తీసుకున్నాం. మిగిలింది కూడా తీసుకోవాలంటే… మా షరతుకు అంగీకరించాలి అని కేంద్రం అన్నదట. ఇది చాలా దారుణమైన ప్రతిపాదన. వానాకాలం పంట కొనాల్సిందే.. యాసంగి పంట కూడా కొనాల్సిందే అని కేసీఆర్ తేల్చి చెప్పాల్సింది. కానీ అలా చేయలేదు. మీరెట్ల చెబితే అట్లనే అని మంచిగ తోపు తీరుగ రాత పూర్వకంగా ఒప్పుకుని వచ్చిండు. ఇప్పుడు కొడ్లాడ్తంట. ఇదే ముచ్చట ఆగస్టులో తెలంగాణ ప్రజలకు చెప్పి… రైతుల్ని ఎంబడేస్కుని ఢిల్లీ పోకపోతివి ఎందుకో..?
ఇద్దరిదీ ఒకటే మాట
ఇప్పుడేమో… అట్లెందుకు చేసినవంటే… “మరేం చేయాలె?.. మెడ మీద కత్తి పెట్టిన్రు” అంటున్నడు. యాసంగి ధాన్యం తీసుకునే ప్రసక్తే లేదని… ఆగస్టులో అంటే… కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ ను బెదిరిస్తే.. మొన్నమొన్నటిదాగా బయటకు ఎందుకు చెప్పలేదు..? కేంద్రం ఇలా అంటోందని తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన కేసీఆర్.. బీజేపీ రైతు వ్యతిరేక విధానాల్ని ప్రజాక్షేత్రంలో పెట్టాల్సిన బాధ్యత గల సీఎం… అలా ఎందుకు చేయలేదు..? కేంద్రం చెప్పినట్టుగానే తలూపి.. సంతకం పెట్టి వచ్చిండు. ఈ ముచ్చట కూడా కేసీఆరే చెప్పినవ్ కదా.. ఇప్పుడు కేంద్రం, రాష్ట్రం కలిసి ముక్తకంఠంతో చెబుతున్నాయి.. “యాసంగిలో రైతుల ధాన్యం కొనబోం. అమ్ముకుంటే మిల్లర్లకు, వ్యాపారులకు అమ్ముకోండి. ఈ మేరకు ఒప్పందం చేసుకోండి” అని. ఇది క్లియర్. ఇద్దరిదీ ఒకటే మాట. ఇదే కదా సాగు చట్టాల్లో కూడా చెప్పింది.
సాగు చట్టాల అప్రకటిత అమలు
సీదీ బాత్ ఏందంటే.. దేశంలో పైకి సాగు చట్టాలు రద్దు చేశామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కానీ అప్రకటిత విధానాల ద్వారా వాటినే అమలు చేస్తోంది. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనదు, రాష్ట్రం కొనదు. మోడీ, కేసీఆర్ ఒకరిపై ఒకరు బురద చల్లుకుంటరు. కానీ… ఇద్దరి మీదా పడదు. ఎవరి మీద పడ్తదంటే రైతుల మీద పడ్తది. రైతుల నోట్లో మట్టి కొడుతున్నరు ఇద్దరు కలిసి. టీఆర్ఎస్, బీజేపీ రెండు జట్లుగా కనిపిస్తున్నా… ఆడేది మాత్రం ఒకటే ఆట. అదీ.. అన్నదాతల జీవితాలతో చెలగాటం. సాగు చట్టాల అప్రకటిత అమలు. వ్యవసాయాన్ని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడం. ఇందుకు కేసీఆర్ కూడా ఒప్పుకున్నడు.. సంతకం పెట్టిండు. కేసీఆర్ మెడ మీద కత్తి పెట్టంగనే కాగితంపై సంతకం పెట్టిండు. కానీ అవి ఫాంహౌస్ పత్రాలు కాదు, పదవీ రాజీనామా పత్రాలు కాదు. రైతుల జీవితాలు, వారి ప్రాణాలు. కాబట్టి.. జానే దో అనుకున్నట్టు ఉన్నడు. చావు నోట్లో తల్కాయ పెట్టొచ్చిన అని చెప్పే మనిషి.. మోడీకి మంచి దోస్తు. కానీ దోస్తు అని కూడా చూడకుండా కేసీఆర్ మెడపై.. మోడీ కత్తి ఎందుకు పెట్టిండు. అసలా కత్తేంటో..! మొత్తానికి మోడీ సర్కారు కత్తి పెట్టింది కేసీఆర్ మెడపై అంటున్నడు కానీ… అసలు విషయం అది కాదు. మోడీ కత్తి పెట్టింది రైతుల మెడపై. అందుకే.. “కత్తి నాది కాదు.. మెడ నాది కాదు.. నరుక్కోండి నాకేం సంబంధం లేదు” అని చెప్పిండనుకోవాలా…?. మోడీ రైతుల తలలు నరుక్కుపోతుంటే మన కాపలాదారుడు.. చోద్యం చూస్తడన్నట్టు. ఇదేం ఖర్మరా నాయనా.. వద్దురా అయ్యా మీ పాలనా అని అనుకోవాలా అంటూ నెత్తి కొట్టుకుంటున్నరు జనాలు.