సింగరేణిపై సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన మామూలుగానే చేసిందా ? బోనస్ అనేది ప్రతి సంవత్సరం మాదిరిగానే ప్రకటించారా ? లేక ఇందులో మర్మమేదైనా ఉందా….?
హైదరాబాద్: ప్రతి సంవత్సరం దసరా పండుగ ముందు సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించటం ఆనవాయితీ. అయితే ఈసారి సింగరేణి కార్మికులకు లక్ష రూపాయల పైచిలుకు బోనస్ ప్రకటించారు సీఎం కేసీఆర్. అయితే ఇందులోనూ రాజకీయ కోణం ఉందన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అక్టోబరు మొదటివారంలో ప్రస్తుతం ఉన్న గుర్తింపు యూనియన్ గడువు ముగుస్తుంది. అంటే సింగరేణిలో మళ్ళీ ఎన్నికల నగారా మోగబోతోంది.
అయితే, అధికార టీఆరెస్ పార్టీకి ఈసారి సింగరేణి ఎన్నికలు అంత వీజీ కావు. గతంలో కేసీఆర్ స్వయంగా ప్రకటించిన వారసత్వ ఉద్యోగాల అంశం ఇప్పటికీ తేలలేదు. వాటితో పాటు ఉద్యోగుల అపరిమిత వైద్యం లాంటి అంశాల్లో టీఆరెస్‌పై అసంతృప్తిగా ఉన్నారు కార్మికులు. పైగా ఉద్యమంలో ప్రతి బొగ్గు గనికి తిరిగి, టీఆరెస్ అనుబంధ గుర్తింపు సంఘం టీజెకేబిఎస్ విజయంలో కీలక పాత్ర పోషించిన కేంగర్ల్ మల్లయ్య సహా ముఖ్యమైన ఉద్యమ నేతలు ఇటీవలే రాజీనామా చేశారు. పైగా వారంతా కేంద్ర మంత్రుల సమక్షంలో బీజేపీ అనుబంధ సంఘం గూటికి చేరబోతున్నారు. ఇక టీఆరెస్‌పై ఉన్న వ్యతిరేకత మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సింగరేణి ప్రాంతాల్లో స్పష్టంగా కనపడింది. దీంతో ముందస్తుగానే మేల్కొవటం మంచిదన్న ఉద్దేశంతో స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగి, గత ఏడాది కన్నా ఎక్కువగా బోనస్ ప్రకించినట్లుగా సింగరేణి కార్మిక నేతలు అంచనా వేస్తున్నారు. ఓటమి భయంతోనే, కేసీఆర్ ప్రకటన చేసినా ఈసారి ఎన్నికల్లో టీఆరెస్ అనుబంధ సంఘాన్ని ఓడించి, సింగరేణి కార్మికుల రాజకీయ చైతన్యాన్ని చాటుతాం అంటున్నారు సింగరేణిలోని ఉద్యమ నేతలు.