భారత రాజ్యాంగాన్ని మార్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. దీనిపై పలువురు ప్రముఖులు స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలను బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ఖండించారు. కేసీఆర్ లాంటి మూర్ఖపు నాయకుల నుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నారు. కేసీఆర్ రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. తన జీవితాన్ని ధారపోసి రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను అవమానించారని అన్నారు.
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. సీఎం అనే విషయాన్ని మరిచిపోయి చిల్లరగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు ప్రవీణ్ కుమార్. తప్పను ఒప్పుకొని యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ప్రవీణ్ కుమార్.
భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందన్నారు. ఎందుకు భారత రాజ్యాంగాన్ని మార్చాలో దేశ ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలని నిలదీశారు. రాజ్యాంగంపై గౌరవం లేని కేసీఆర్.. సీఎం పదవికి అనర్హుడని మండిపడ్డారు. కాళేశ్వరంలో లక్ష 15 వేల కోట్ల రూపాయలు ఒకటే కంపెనీకి ఇచ్చి తిరిగి దొడ్డిదారిన కేసీఆర్ సంపాదిస్తున్నాడని ఆరోపించారు. ఒక ఐఏఎస్ అధికారి ఇంట్లో జరిగిన కార్యక్రమానికి మెగా సంస్థ 50 లక్షల రూపాయలు ఇచ్చారని ఆరోపణలు చేశారు ప్రవీణ్ కుమార్. తమ బినామీలను పెంచిపోశించేందుకు కొన్ని జీవోలు రహస్యంగా తీసుకొస్తున్నారని అన్నారు.
Advertisements
లక్షలాది ఎకరాల అసైన్డ్ భూములను లాక్కొని మీకు సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టడం కోసం రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారా..? అని ప్రశ్నించారు. నిరంకుశ పాలన కొనసాగించడానికే రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారా..? అంటూ మండిపడ్డారు. ప్రజలంతా ఏకమై ఇలాంటి దేశద్రోహులనుండి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని అన్నారు. కేసీఆర్ బాధ్యతారహితమైన ప్రకటనలు మానుకొని అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ క్షమాపణ చెప్పేవరకు రాష్ట్రవ్యాప్తంగా బీఎస్పీ తరపున ఆందోళనలు నిర్వహిస్తున్నామని హెచ్చరించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.