సీఎం కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరుల త్యాగాలతో కేసీఆర్ కుటుంబం జల్సాలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఒక్క కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడుందని ఆయన ఆరోపించారు.
తెలంగాణ తెచ్చింది, ప్రాణత్యాగం చేసింది ఒక్క కుటుంబం కోసమేనా? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ బిడ్డ, కొడుకు అమెరికాలో చిప్పలు కడుగుతున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
బీజేపీ పెట్టిన భిక్ష వల్లే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ బిల్లు తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రం రాలేదన్నారు. సుష్మా స్వరాజ్ పార్లమెంట్‌లో పోరాడితేనే రాష్ట్రం వచ్చిందని వెల్లడించారు. మహిళా మోర్చా అంటే కవిత గజగజ వణుకుతోందని చెప్పారు. గూగుల్‌లో వేస్ట్ ఫెలో ఆఫ్ ఇండియా అని కొడితే కేసీఆర్ పేరు వస్తోందన్నారు.
గ్రేట్ లీడర్ అని సెర్చ్ చేస్తే మోడీ పేరు వస్తోందన్నారు. అనుమానం ఉంటే ఫోన్‌లో చెక్ చేసుకోవచ్చన్నారు. ఇది తానో, ఇంకెవరో పెట్టింది కాదన్నారు. కవిత పేరు ప్రస్తావించకుండా ఢిల్లీ లిక్కర్ స్కాంపై ఆయన మాట్లాడారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఒక మహిళ హస్తం ఉండటంతో దేశ మహిళల ప్రతిష్ట దిగజారిందన్నారు.
జాతీయ రాజకీయాల పేరిట బీఆర్ఎస్ పార్టీని పెట్టి, ఇప్పుడు దాన్ని కవితకు అప్పగిస్తున్నాడన్నారు. అది కూడా దేశాన్ని దోచుకోవడానికే అని ఆయన ఆరోపణలు చేశారు. మెడికో ప్రీతి మృతి వ్యవహారంపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి నాయక్‌ది ముమ్మాటికీ హత్యేనని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం డైరెక్షన్‌లోనే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారన్నారు.