కేసీఆర్ జాతీయ పార్టీ సందర్భంగా పలు రాష్ట్రాలకు చెందిన నేతలు హైదరాబాద్ కు వచ్చారు. కేసీఆర్ ఆహ్వానం మేరకు 40 మంది ప్రముఖ నేతలు ప్రగతి భవన్ లో సీఎంను కలిశారు. కర్ణాటక నుంచి జేడీఎస్ నేత కుమారస్వామి, మాజీ మంత్రి రేవణ్ణతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, తమిళనాడు నుంచి వీసీకే వ్యవస్థాపక అధ్యక్షుడు తిరుమావళవన్ వచ్చారు.
తమిళనాడు తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారావును ఆహ్వానించారు కేసీఆర్. కొందరు జాతీయ రైతు సంఘం ప్రతినిధులు కూడా వచ్చారు. కేసీఆర్ తో కుమారస్వామి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై ఇద్దరూ చర్చించారు. వీరందరికీ ఉదయం ప్రత్యేక ఆతిథ్యం అందించారు కేసీఆర్.
ఇక కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ ను సుందరంగా అలంకరించారు. చుట్టుపక్కల, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జాతీయ పార్టీని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేశారు. కేసీఆర్ ప్రకటన చేసిన వెంటనే తెలంగాణ భవన్ తో పాటు హైదరాబాద్ తోపాటు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
మరోవైపు టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం కవరేజ్ కు మీడియాను అనుమతించ లేదు. మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఉంటే చెప్తామంటూ తెలంగాణ భవన్ నుంచి మీడియాను బయటికి పంపారు. సీఎం ఆదేశాలతోనే బయటికి పంపామని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తెలంగాణ భవన్ బయట రోడ్డుపైనే మీడియా ప్రతినిధులు నిలబడి ఉన్నారు.