రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై, రైతుల సమస్యలపై, విద్యాసంస్థల నిర్వహణతో పాటు పలు అంశాలపై చర్చించారు.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, వైరస్ కట్టడికి ఆరోగ్యశాఖ తీసుకుంటున్న చర్యలను మంత్రి హరీశ్ రావు సీఎం కేసీఆర్ కి వివరించారు. రాష్ట్రంలో కరోనా అదుపులో ఉందని.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కునేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటి వరకూ 5 కోట్ల టీకా డోసులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఓ వైపు అర్హులైన వారందరికీ టీకాలు ఇస్తూనే.. ప్రజలు నిబంధనలు పాటించేందుకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నిబంధనలు పాటిస్తే కరోనాను నియంత్రించవచ్చని హరీష్ స్పష్టం చేశారు. మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల సహకారం తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.
మరోవైపు ప్రైవేట్ స్కూల్లు, జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రించేందుకు కేబినేట్ మీటింగ్ లో చర్చించినట్టు తెలుస్తోంది. దీనికి తోడు వచ్చే విద్యా సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశ పెట్టేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. ఫీజులు నియంత్రణ, ఇంగ్లీష్ మీడియంపై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్ లు సభ్యులుగా ఉంటారు. సబితా ఇంద్రారెడ్డి ఈ కమిటీకి అధ్యక్షురాలిగా ఉంటారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్ల తో ‘‘ మన ఊరు – మన బడి ’’ ప్రణాళిక కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.
మరోవైపు అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు రేపు సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్‌తో పాటు పర్యటనలో పాల్గొననున్నారు.
వీటితో పాటు.. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు, ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులపై సమావేశంలో చర్చించారు. జీవో నెం. 317 గురించి కూడా చర్చకు వచ్చింది. దళితబంధుతో పాటు రాష్ట్రంలో రాజకీయపరమైన అంశాలపై కేబినెట్ లో చర్చించారు.