కేసీఆర్‌కు ఉప ఎన్నిక భయం పట్టుకుందా…? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చేసిన సర్వేల్లో టీఆర్ఎస్‌కు ఓటమి ఖాయమని నివేధికలు అందుతున్నాయా…? మండలానికో మంత్రిని ఇంచార్జీగా వేసినా పరిస్థితి మారటం లేదా…? కేటీఆర్ వెళ్లినా… సర్వేల్లో తేడాలేదని టీఆర్ఎస్ మదనపడుతుందా…? అంటే అవుననే అంటున్నాయి టీఆరెఎస్ భవన్ వర్గాలు.
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలన్న కసి ఉన్నా… టీఆర్ఎస్‌కు స్థానికంగా పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు కనపడటం లేదు. టీఆర్ఎస్ తెప్పించుకుంటున్న సర్వేల్లో పార్టీకి అనుకూల పరిస్థితులు లేవని తెలుస్తోందని సమాచారం. ఇప్పటికే మంత్రులు, కేటీఆర్ వెళ్లి ప్రచారం చేసినా… గెలుపుపై పూర్తిస్థాయి నమ్మకం రావటం లేదని తెలుస్తోంది. ఎలాగైనా గెలిచి తీరాలని కేసీఆర్ తన గులాబీ దండుకు చెప్పి పంపించినా, క్షేత్రస్థాయి పరిస్థితులు అంత సానుకూలంగా కనపడటం లేదు.
పేరుకు ఉప ఎన్నికే అయినా… టీఆర్ఎస్‌కు ఈ ఎన్నిక ఎంతో కీలకం. ఓవైపు బీజేపీ కత్తులు దూస్తున్న తరుణంలో, కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఉత్తేజం రాకుండా ఉండాలన్నా… టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏమాత్రం తేడా వచ్చినా… టీఆర్ఎస్‌కు ఇంటా,బయటా పోరు తప్పేలా లేదు. అందుకే తానే స్వయంగా రంగంలోకి దిగబోతున్నారు కేసీఆర్.
అవును… గతంలో ఎప్పుడూ లేనంతగా కేసీఆరే స్వయంగా ఉప ఎన్నిక ప్రచారాన్ని భుజాన వేసుకోబోతున్నారు. తాను వెళ్తే తప్పా… పార్టీ ప్రచారానికి ఊపు రాదని, పరిస్థితుల్లో మార్పు రాదని ఆయన పార్టీ అంచనా వేస్తోంది. అందుకే ఈనెల 18న కేసీఆర్ హుజూర్‌నగర్‌లో ప్రచారం నిర్వహించబోతున్నారు. భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి… విజయవంతం చేసే పనిలో బిజీగా ఉంది టీఆర్ఎస్ పార్టీ. అయితే, ఆలోపే కేటీఆర్ మరో రెండు రోజుల పాటు రోడ్ షోలు, బహిరంగ సభల ద్వారా ప్రచారం చేయించాలని కూడా నిర్ణయించింది. చివరి పది రోజుల్లో పరిస్థితి ఇలాగే ఉంటే… ట్రబుల్ షూటర్ హరీష్‌ను కూడా రంగంలోకి దించే అవకాశం లేకపోలేదంటున్నాయి పార్టీ వర్గాలు.