గురివింద గింజ… నానుడి చాలా పాతది. కానీ, ఎన్ని ఉదాహరణలు చెప్పినా.. ఎన్నేళ్లు గడిచినా ఎప్పటికీ అది కొత్తగానే అనిపిస్తుంది. ఇప్పుడు మళ్లీ కేసీఆర్ విషయంలో ఆ పాత నానుడి అందరికీ గుర్తొచ్చింది. పక్క రాష్ట్రానికి రాజధాని లేక కట్టుకుంటుంటే అది డెడ్ ఇన్వెస్టుమెంట్.. మరి తెలంగాణలో ఏం అవసరం వుందని పాతవి కూల్చేసి కొత్త పరిపాలన భవనాలు కడుతున్నారు? అడ్డంగా మాట్లాడితే అడిగేవారు లేరనా భయ్.. అని జనం తిట్టుకుంటున్నారు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాన్ని తెలంగాణ సీయం కేసీఆర్ ‘డెడ్ ఇన్వెస్టుమెంట్’గా చెప్పుకొచ్చారు. ఈ నిర్మాణం వేస్టు అని అప్పుడే చంద్రబాబుకు చెప్పానని శాసనసభలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు కేసీఆర్ ఎత్తిపోతల పధకం ఎంత అవసరమో చెప్పదలచుకున్నారు. పనిలో పనిగా అమరావతి ఎంత అనవసరమో చెప్పేశారు. మరి సారు వాడు పాత సచివాలయం కూల్చేసి కొత్తగా సచివాలయం ఎందుకు నిర్మించాలని తలపెట్టారో మాత్రం చెప్పలేదు. కేసీఆర్ ఏమన్నారంటే… ‘ఎత్తిపోతల కరెంటుపై కొందరు ఎత్తిపొడిచారు. జయప్రకాశ్ నారాయణ.. ఆయనెవరో నాకు అర్థం కాలేదు. ఆయనేదో పెద్ద కత చేసి స్టేట్‌మెంట్ ఇచ్చిండు. ఆయనకేం అవసరం. ఔరోకి షాదీమే అబ్దుల్లా బేగానా.. అన్నట్లు ఆయనది మన రాష్ట్రం కాదు, మన్ను కాదు. బాధ కలుగుతుంది అధ్యక్షా, ఇదంతా వేస్టు అంటడు ఆయన. పక్క రాష్ట్రంలో రూ.53 వేల కోట్లతో అమరావతి కడుతుంటే దాన్ని డప్పు కొడతానంటాడు. అహో, ఓహో అని. అది డెడ్ ఇన్వెస్టుమెంట్. కట్టవచ్చునా అధ్యక్షా. ఆ చంద్రబాబు నాయుడికి కూడా చెప్పా.. కట్టకయ్యా వేస్టు అని. రాయలసీమకు నీళ్లు తీసుకుపో అని చెప్పా. కట్టిండు. ఆయంత ఎల్లకిలాబడ్డడు. పరిణామం ఏంటో తెలిసింది’’ అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. మరి ఇప్పుడు కేసీఆర్ కూడా హైదరాబాద్‌లో కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకున్నారు. యాదాద్రిలో పురాణ ప్రాశస్థ్యం గల దేవాలయాన్ని పునర్ నిర్మిస్తున్నారు. ఓపక్క ముఖ్యమైన శాఖలకు బడ్జెట్‌లో సరైన కేటాయింపులు లేవని విపక్షాలు గొడవ చేస్తున్నాయి. వాటిని పక్కన పెట్టేసి పాత సచివాలయ భవనాలు మాత్రం కూలగొట్టించేశారు. జయప్రకాశ్ నారాయణ ఈ విషయాన్ని లేవనెత్తితే కేసీఆర్ ఫేస్ ఎక్కడ పెట్టుకుంటారు? అని జనం ప్రశ్నిస్తున్నారు.