ఇటీవల కేసీఆర్ చేస్తున్న పలు విమర్శలు మిస్ ఫైర్ అయి ఆయనకే తిరిగి తాకుతున్నాయి. తాజాగా కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేయాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. కొత్త రాజ్యాంగం ఏర్పాటు చేయాలనడం రాజ్యాంగ నిర్మాతల మేథస్సును తక్కువ చేయడమేనని, రాజ్యాంగ బద్ద పదవిలో ఉంటూ రాజ్యాంగంపైనే కేసీఆర్ విమర్శలు చేయడమేంటని పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
రాజ్యాంగ నిర్మాతలు దూరదృష్టి కలవారని, భవిష్యత్ లో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని వారు ముందే ఊహించారని రాజకీయ పండితులు చెబుతున్నారు. అందుకనే రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజే * భవిష్యత్ లో ఈ కొత్త రాజ్యాంగం అమలులో ఏదైనా తప్పులు జరిగితే దానికి రాజ్యాంగాన్ని విమర్శించకూడదు. కేవలం దాన్ని అమలు చేస్తున్న వారిని దానికి బాద్యులుగా భావించాలి అని సూచించారని రాజకీయ పండితులు చెబుతున్నారు. అయినప్పటికీ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవడానికి రాజ్యాంగ సవరణ అనే ఆయుధాన్ని ఇచ్చారని గుర్తు చేస్తున్నారు.
మాట్లాడితే 80వేల పుస్తకాలు చదివాను అని చెప్పుకునే కేసీఆర్ ఈ విషయం ఎక్కడా చదవలేదా అని వారు ప్రశ్నిస్తున్నారు. రాజ్యాంగ బద్దంగా పాలన చేస్తానని ప్రమాణం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ రాజ్యంగం సరిగా లేదని ఇప్పుడు కొత్తది కావాలనడం ఆయన విపరీతమైన పోకడకు తార్కాణం అని వారు వివరిస్తున్నారు.
కేసీఆర్ తీరు చూస్తుంటే ఆయన రాజ్యాంగానికి అనుగుణంగా నడవడం కాదు రాజ్యాంగమే ఆయనకు అనుకూలంగా ఉండాలని భావిస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. ఆయన వ్యాఖ్యలు అర్దరహితమని వారు పేర్కొంటున్నారు. రాష్ట్రాలకు నిధులు, అధికారాలు సాధించుకోవడానికి రాజ్యాంగంలో పరిష్కార మార్గాలు చూపించారని అంతే కాని కొత్త రాజ్యాంగం కావాలనడం సరికాదని వారు అంటున్నారు.