– తెలంగాణలో పీకే తాజా సర్వే
– మారని పరిస్థితి.. ఎమ్మెల్యేలపై అదే అసంతృప్తి
– కేసీఆర్ పైనా రగిలిపోతున్న జనం
– సిట్టింగ్ లపై చర్యలకే పీకే మొగ్గు
– ఏం జరుగుతుందా? అనే టెన్షన్ లో సారు!
– డబుల్ గేమ్ ఆడుతున్న కొందరు ఎమ్మెల్యేలు
– కేసీఆర్ దేవుడు అంటూనే.. ఇతర పార్టీలతో చర్చలు
మొదటిసారి ఉద్యమ ఊపులో గెలిచారు.. రెండోసారి ముందస్తుకు వెళ్లి తప్పించుకున్నారు.. ఈసారి టీఆర్‌ఎస్ ఓటమి పక్కా అని అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ గట్టిగా చెబుతున్నాయి. ఆ రెండు పార్టీలు అలా చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి. నిరుద్యోగుల్లో పెరిగిన నిరాశ.. రైతుల్లో అసంతృప్తి.. పింఛన్లు, ఇళ్ల విషయంలో ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత ఉండడంతో ఈసారి టీఆర్‌ఎస్ ఓటమి ఖాయమని ధీమాగా ఉన్నాయి ఆ రెండు పార్టీలు. జాతీయ రాజకీయాలు అని తిరుగుతున్న కేసీఆర్ కు పీకే టీమ్ కూడా ఇదే స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా నిర్వహించిన సర్వేలో టీఆర్‌ఎస్ పాలనపై జనం అసంతృప్తితో రగిలిపోతున్నారని.. చాలామంది ఎమ్మెల్యేలపై విసిగిపోయి ఉన్నారని తేలిందట.
ఈ 8 ఏళ్ల పాలనలో గులాబీ ఎమ్మెల్యేలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్లు, వివాదాల్లో తలదూర్చుతూ డబ్బులు పోగు చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. దానికి తగ్గట్టే రోజూ ఏదో ఒక విషయం తెరపైకి వస్తూనే ఉంది. కొందరైతే నియోజకవర్గానికి దూరంగా ఉంటూ హైదరాబాద్ లోనే మకాం వేస్తున్నారని.. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరిగిందని చెబుతున్నారు విశ్లేషకులు. పీకే ఇచ్చిన రిపోర్ట్ ని ఫాలో అయితే గనక చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎసరు తప్పదు. అయితే.. వారిని తేలిగ్గా తీసుకోవడానికి లేదని అంటున్నారు రాజకీయ పరిశీలకులు ఎందుకంటే.. చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కేసీఆర్ తో డబుల్ గేమ్ ఆడుతున్నారని అంచనా వేస్తున్నారు. ఇటు ఆయనకు విధేయులం అని చెబుతూనే ఇతర పార్టీలకు టచ్ లో ఉన్నారట వారంతా.
పీకే సర్వేలలో మంచి ఫలితం వస్తేనే టికెట్లు ఇస్తామని అధిష్టానం ముందే చెప్పింది. దీంతో ఇతర పార్టీల్లో చేరడానికి గులాబీలు మంతనాలు జరుపుతున్నారట. అంటే.. ఇది కాకపోతే ఇంకో పార్టీ అన్నచందంగా వారంతా ఫిక్స్ అయిపోయి ఉన్నారని అంటున్నారు విశ్లేషకులు. ఈ క్రమంలోనే కేసీఆర్ కు టెన్షన్ పట్టుకుందని.. అందుకే జాతీయ రాజకీయలను సైతం పక్కన పడేసి.. ముందు రాష్ట్రంలో పార్టీని చక్కదిద్దుకుంటున్నారని చెబుతున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో చక్రం తిప్పాలని చూసిన ఆయనకు.. సొంత పార్టీ నుంచే షాకులు ఎదురవుతుండడంతో ముందు ఇక్కడి సంగతి చూసుకోవాలని భావించినట్లుగా వివరిస్తున్నారు.
పీకే దాదాపు 40 మంది ఎమ్మెల్యేల తీరుపై నెగెటివ్ రిపోర్ట్ ఇచ్చారని టాక్. వారిలో 20 మంది వరకు వెరీ బ్యాడ్ రేంజ్ లో ఉన్నారట. అంటే.. వారందరికీ టికెట్లు రావడం కష్టమే. దీన్ని ముందే గ్రహించిన వారు ఇతర పార్టీలను ప్రసన్నం చేసుకుంటున్నారని అంటున్నారు విశ్లేషకులు. అయితే.. వారంతా నిజంగా పార్టీని వీడితే ఆ స్థాయిలో ఇతర నాయకులు నిలబడగలుగుతారా? అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే.. కేసీఆర్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఆయన ఫోటో పెట్టుకుని గెలవడం అంటే కష్టమే. డబ్బులు కూడా గట్టిగానే ఖర్చు చేయాల్సి ఉంటుందని అంటున్నారు. హుజూరాబాద్ ఎన్నిక చూశాక.. ఆ రేంజ్ లో ఖర్చు పెట్టగలిగే నేతలు ఉన్నారా? అది కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు పోటీగా.. అంటే కష్టమేననే సమాధానం వస్తోంది. ఒకవేళ కేసీఆర్ రంగంలోకి దిగినా పెద్దగా ప్రయోజనం ఉండదనే చెబుతున్నారు. ఎటుచూసినా ఈసారి టీఆర్‌ఎస్ గెలుపు అంత ఈజీ కాదని అంచనా వేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వకపోయినా నష్టమే.. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం కల్పించినా నష్టమే తప్ప.. ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చని విశ్లేషణ చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.