హైదరాబాద్‌కు నలుమూలలా పేదలకు అందుబాటులో ఉండేలా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను తీసుకురావడమే టీఆర్ఎస్ లక్ష్యమని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరో మూడు నూతన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. టిమ్స్ పేరుతో నిర్మించపోయే మూడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లకు భూమి పూజ చేశారు సీఎం కేసీఆర్.
ముందుగా ఎల్బీనగర్ పరిధిలోని గడ్డిఅన్నారం వద్ద నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ భూమిపూజ చేశారు. అనంతరం సనత్‌నగర్ చెస్ట్ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మించనున్న వేయి పడకల టిమ్స్ హాస్పిటల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన కేసీఆర్.. అక్కడి నుండి అల్వాల్ చేరుకున్నారు. చివరిగా అక్కడ నిర్మించనున్న టిమ్స్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు సీఎం.
కొత్తగా ఏర్పాటు చేయనున్న ఒక్కో ఆసుత్రిని 13.71 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. వెయ్యి పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్నట్టు సీఎం పేర్కొన్నారు. ఎయిమ్స్ తరహా ఆస్పత్రులు అందుబాటులోకి తీసుకురావలనే దృఢసంకల్పంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. కొత్తగా నిర్మించబోయే వాటితో కలుపుకొని నగరంలో నాలుగు టిమ్స్ ఆసుపత్రులు ప్రజలకు అందుబాటులో ఉండబోతున్నాయన్నారు. నాలుగు టిమ్స్ లో కలిపి మొత్తం 6 వేల బెడ్స్ అందుబాటులోకి వస్తాయని వివరించారు కేసీఆర్.
వైద్య విధానాన్ని పటిష్ఠపరిచేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో.. జిల్లాకో వైద్య కళాశాలను ఏర్పాటు చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. కర్ఫ్యూలు, మతఘర్షణలు ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా..? అని బీజేపీ ని ఉద్ధేశించి మాట్లాడారు. భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన సమాజంలో.. మతం, కులం పేరు మీద కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అనారోగ్యంతో ప్రభుత్వ దవాఖానాల్లో ఎవరైనా చనిపోతే మృతదేహాలను ఇంటికి తీసుకెళ్లేందుకు 50 నుండి 60 వాహనాలు వెంటనే ఏర్పాటు చేయాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసినట్టు సీఎం తెలిపారు.