ప్రగతి రథ చక్రాలు ఆగిపోతే ఏమౌతుంది…? ఓ ప్రభుత్వ రంగ సంస్థే కదా అనుకుంటే ఏం జరిగింది…? 15రోజుల వ్యవధిలో తెలంగాణ పరిస్థితి ఎంటీ…? నేతల మేకపోతు గాంభీర్యం ప్రజలకు ఎలాంటి కష్టాన్ని తెచ్చిపెట్టింది…?
ఏసీ రూముల్లో కూర్చుంటే ఏం తెలుస్తుంది సగటు ప్రయాణికుడి బాధ…? ఒక్కసారి అదిలాబాద్ గిరిజన ప్రాంతాలకు వెళ్లి చూడండి. ఆర్టీసీ అసవరం, ఆవశ్యకత తెలుస్తుంది. ఈ వ్యాఖ్యలు ఎవరో మాములు వ్యక్తి అన్నవి కావు. హైకోర్టు తన విచారణలో చెప్పిన అంశాలు. నిజమే కదా… హైదరాబాద్ నగరంలోనో, మరొక పట్టణ ప్రాంతంలో అంటే ఎలాగోలా గమ్యస్థానాలకు చేరవచ్చు. కానీ గిరిజన, లంబాడా తండాల ప్రజలకు బస్సు వస్తేనే ప్రయాణం. చదువుకునేందుకు పట్టణాలకు పోయే విద్యార్థులకు బస్సే ఆధారం. కానీ 15రోజుల ఆర్టీసీ కార్మిక సమ్మె ప్రభావం అన్ని రంగాలకు తాకింది.
కామన్ మ్యాన్ రిచ్ వెహికల్‌గా పిలవబడే ఆర్టీసీ బస్సు ఆగిపోవటం మూలంగా… 50వేల మంది కార్మికులు తెలంగాణలో పెద్ద పండుగైన దసరా పూట పస్తులున్నారు. కొత్త బట్టలు కట్టుకొని, సంతోషంగా పిల్లాపాపలతో గడపాల్సిన వారు రోడ్ల మీద నినదించారు. 1000లతో నెలంతా ప్రయాణించే సగటు ఉద్యోగులు, కార్మికులు… విద్యార్థులకు ఈ 15రోజుల్లోనే గమ్యస్థానాలకు చెరటానికి తమ నెల జీతాన్ని పూర్తిగా ఖర్చు చేసేశారు.
ఇక తాత్కాలిక సిబ్బంది చేసిన పనికి… ఈ 15రోజుల్లో ఆర్టీసీకి ఎంత నష్టం వచ్చిందో కానీ కొత్త సిబ్బంది చేసిన డ్యామెజ్‌ల రిపేయిర్లకు అంతకన్నా ఎక్కువే అయి ఉంటుంది. ప్రభుత్వం పట్టింపులకు పోయి, ఆర్టీసీకి మరింత నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇక విద్యార్థుల పరిస్థితి దయనీయంగా తయారైంది. దసరా పండుగకు ఇచ్చిన సెలవులు… వేసవి సెలవుల్లా తయారయ్యాయి. దాదాపు 20రోజులకు పైగా పిల్లలు ఇంటికే పరిమితమైపోయారు. ఇక తాత్కాలిక ఉద్యోగులు… మహిళలపై వేధింపులు, వివిధ కోర్టులో కార్మికులు వేసిన కేసులు సరేసరి.
ఇవన్నీటికి మించి… కార్మికులు ఎంతో విలువైన తమ ప్రాణాన్ని కోల్పోయారు. తమ కుటుంబాలకు తీరని దుఖాన్ని మిగిల్చారు. పనిచేసిన నెలకు కూడా జీతం ఇవ్వకుండా కేసీఆర్ సర్కార్ వేధించటంతో… నెల నెలా కట్టాల్సిన బకాయిలు చెల్లించలేక, పరువుకు బయపడి… కేసీఆర్ మొండితనం ఇంకెంత కాలం తమను వెంటాడి వేధిస్తుందో అన్న బాధతో ఆత్మాహుతి చేసుకున్నారు.
ఇలా కేసీఆర్ మొండి తనానికి ప్రత్యక్షంగా 50వేల కుటుంబాలు, పరోక్షంగా లక్షలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు ఇలా… తెలంగాణలో ప్రతి ఇంటికి బాధ తప్పలేదు. ఏరి కోరి ఎన్నుకున్న పాపానికి దసరా పండుగ పూట నరకం చూపించి, సమైక్యాంధ్ర పాలకుల కన్నా ఎక్కువగా హింసలు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు మేధావులు, ఆర్టీసీ కార్మికులు.