టీబీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరో సారి కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ దళిత ద్రోహిగా మిగిలిపోయారని అన్నారు. తెలంగాణ బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం హైదరాబాద్ లో జరుగుతోంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రశ్నా పత్రాల లీకేజీ వెనుక సీఎంవో మాజీ అధికారి, ప్రస్తుత బీఆర్ఎస్ నాయకుడు ఉన్నారని ఆరోపించారు. కేసీఆర్ అధికారం చేపట్టిన నాటి నుంచి దళితులపై దాడులు పెరిగిపోయాయన్నారు. అంబేద్కర్ జయంతి, వర్థంతికి సీఎం కనీసం నివాళులర్పించడం లేదని విమర్శించారు.
దళిత నియోజక వర్గాల పట్ల సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ముఖ్యమంత్రి పొగిడిన శ్రీలంక, పాకిస్థాన్ దేశాల పని అయిపోయిందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్థి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కారుతోనే సాధ్యమని పేర్కొన్నారు. కేసీఆర్ బిడ్డ కవితను కాపాడేందుకు మంత్రివర్గం మొత్తం ఢిల్లీ పోయిందని విమర్శించారు.
రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు జరిగినా.. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదన్నారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల వేలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ ను మంత్రివర్గం నుంచి భర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీజేపీ దీక్షలు చేపడుతుందని బండి స్పష్టం చేశారు.