టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత మౌనం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మొన్నటిదాకా కొడుకు, మేనల్లుడితో పాటే కుమార్తెను కూడా కొన్నాళ్లు దూరం పెట్టిన కేసీఆర్.. ఈటల రాజేందర్ ఎపిసోడ్ తర్వాత కాస్త వెనక్కి తిరిగిచూశారు. కేటీఆర్, హరీష్ రావులను పిలిచి.. మళ్లీ కీలకమైన బాధ్యతలని వారికి అప్పగించారు. కానీ కవితను మాత్రం కేసీఆర్ అసలు పట్టించుకోకపోవడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి.
కవిత కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే మానేశారు. ఆహ్వానం లేదో లేదా తనకే ఆసక్తి లేదో తెలియదు కానీ ఏ వేదికపైనా ఆమె కనిపించడం లేదు. ఈటల వ్యవహారం ముందూ, తర్వాత కూడా.. దాదాపుగా కొన్ని నెలలుగా కవిత పొలిటికల్ స్క్రీన్‌పై ఆచూకీ లేకుండాపోయారు. 2109 ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోయినప్పటికీ.. ఆ మధ్య పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపించేవారు కవిత. ఆతర్వాత అక్టోబర్ 2020 లో నిజామాబాద్ జిల్లా నుంచి MLC గా గెలవడంతో.. మళ్లీ టీఆర్ఎస్‌లో ఆమె ప్రాధాన్యత పెరిగిపోయినట్టు కనిపించింది. కవిత కేబినెట్‌లో చేరతారని పుకార్లు కూడా వచ్చాయి. కానీ నెలలు గడిచినా అదేం జరగకపోగా.. కవిత మళ్లీ తెరవెనుకకకే వెళ్లిపోయారు.
కవిత చివరిసారిగా మార్చి- ఏప్రిల్ నెలల్లో కొండగట్టులో హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. రాజకీయాల్లో తిరిగి క్రియాశీలకంగా మారే క్రమంలోనే ఆమె ఆ కార్యక్రమాన్ని నిర్వహించారని అంతా అంచనా వేశారు. కానీ అనూహ్యంగా.. అందరి అంచనాలకు భిన్నంగా అప్పటి నుంచి అసలు మీడియాలో కనిపించడమే మానేశారు. కనీసం ఈటల ఎపిసోడ్ తర్వాత కవిత యాక్టివ్ అవుతారని… ఉప ఎన్నిక ప్రచారంలో కనిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ హరీష్ రావు, కేటీఆర్‌కు తప్ప.. కవితకు తండ్రి నుంచి పిలుపురానట్టుగా ఉందని చెప్పుకుంటున్నారు.
ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై కూడా, ఒకప్పటిలా యాక్టివ్‌గా లేరు కవిత. సీఎంవో లేదా టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ట్వీట్లనే ఆమె రీట్వీట్ చేస్తూ వస్తున్నారు. రాజకీయ పరిణామాలపై కౌంటర్లు లేవు. కామెంట్లు లేవు. అసలు స్పందించడమే లేదు. అటు తన నియోజకవర్గానికి కవిత వెళ్తున్నట్టుగా లేదని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో కవిత ఎందుకు మౌనంంగా ఉంటున్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో బలంగా సాగుతోంది. ప్రగతి భవన్ వర్గాల సమాచారం ప్రకారం.. కేసీఆర్‌తో తీరికగా మాట్లాడేందుకు కవితకు అసలు అవకాశమే దొరకడం లేదని, పైగా ఆయనతో మాట్లాడాలనుకుంటే పదే పదే సంతోష్ రావు అనుమతి తీసుకోవాల్సి రావడం ఆమెకు నచ్చడం లేదని తెలుస్తోంది. పైగా కేసీఆర్ ఈ మధ్య కేటీఆర్ కంటే కూడా సంతోష్ రావుకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె కినుక వహించారని అనుకుంటున్నారు.
మరోవైపు కవిత మద్దతుదారులు మాత్రం.. ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్‌లోని చోటా, మోటా నాయకులు కూడా హుజురాబాద్ ఎన్నికల్లో హల్‌చల్ చేస్తోంటే.. తమ నాయకురాలి మాత్రం ప్రాధాన్యత ఇవ్వకపోవడం వారికి మనస్తాపాన్ని కలిగిస్తోంది. కనీసం నిజామాబాద్‌లో అయినా చురుగ్గా ఉండాలని ఆమెను కోరుతున్నారు. మొత్తానికి కవిత మౌనం ఇప్పుడు టీఆర్ఎస్‌లో బిగ్ డిబేట్‌గా మారింది.