తెలంగాణలో తన ప్రాభవాన్ని క్రమక్రమంగా కోల్పోతున్న టీఆర్ఎస్ పక్క రాష్ట్రంలో పాగా వేయడానికి ప్రయత్నం చేస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల బరిలో నిలవాలని డిసైడయ్యింది. నాందేడ్ జిల్లాలోని 5 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని అక్కడి నుంచి వచ్చిన పలువురు నేతలు కోరడంతో కేసీఆర్.. యస్.. చేసేద్దాం అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో తెలంగాణలో వున్న నాందేడ్ జిల్లాలోని 6 నియోజకవర్గాలను తెలంగాణలో కలపాలని అక్కడ వీరంతా ఉద్యమం నడుపుతున్నారు.
హైదరాబాద్: రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను తమ గ్రామాల్లోనూ అమలు చేయాలని, అలా చేయలేని పక్షంలో తమ గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలో కలపాలని మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రజలు ఉద్యమబాట పట్టారు. ఇదే నినాదంతో త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని వారు నిర్ణయించారు. ఈ విషయాన్ని వారు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తెలిపి, తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. తాము టీఆర్ఎస్ పార్టీ టికెట్లపై పోటీ చేయడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.
నాందేడ్ జిల్లాకు చెందిన నయ్ గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్ హథ్ గావ్ నియోజకవర్గాలకు చెందిన నాయకులు అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని ఉద్యమం నిర్వహించిన బాబ్లీ సర్పంచ్ బాబురావు గణపతిరావు కదమ్ నాయకత్వంలో వారంతా హైదరాబాద్ వచ్చారు.