బెంగుళూరు డ్రగ్స్ రాకెట్ ఇప్పుడు టీఆర్ఎస్ నేతలను వణికిస్తోంది. పక్క రాష్ట్రంలో ఏం చేసినా నడుస్తుంది అనుకున్నారో… రేంజ్ ఉండాలంటే ఆ మాత్రం తప్పదనుకున్నారో కానీ ఇప్పుడు అసలుకే ఎసరు వచ్చింది.
బెంగుళూరులో వ్యాపారాలు చేస్తున్న ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అధిష్టానం ఆరా తీసినట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాకు చెందిన యువ ఎమ్మెల్యేతో పాటు నిజామాబాద్ కు చెందిన ఇద్దరు యువ ఎమ్మెల్యేలు ఇందులో ఉన్నట్లు టీఆర్ఎస్ అధినాయకత్వానికి సమాచారం అందినట్లు ప్రచారం సాగుతుంది.
డ్రగ్స్ కేసులో దూకుడు పెంచిన బెంగుళూరు పోలీసులు… పక్కా ఆధారాలతో రెండు, మూడు రోజుల్లో సదరు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వనున్నారు. దీంతో సాగర్ ఉప ఎన్నికల ముందు నోటీసులు అందితే పార్టీకే చెడ్డ పేరు వస్తుందని, నోటీసులు అందిన మరుక్షణం ఆ ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను సస్పెండ్ చేయాలని కేసీఆర్, కేటీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు టీఆర్ఎస్ భవన్ వర్గాలంటున్నాయి.
ఈ అంశం కేసీఆర్ దృష్టిలో ఉన్నందునే… పార్టీ నేతలు ఎవరూ నోరు మెదపటం లేదని, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు సీఎంను కలిసే ప్రయత్నం చేసినా ఫలించలేదని, కేటీఆర్ కూడా చేతులెత్తేశారన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఎమ్మెల్యేలకు నోటీసులు అందితే… వారి అనుచరులు, సన్నిహితంగా ఉన్న నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం లేకపోలేదు.